'హామీలకు మంగళం.. రైతన్నకు మరోసారి మోసం'.. రేవంత్‌ సర్కార్‌పై హరీష్‌ రావు ఫైర్‌

రైతుల ఆశలు అడియాశలు చేసేలా కాంగ్రెస్‌ ప్రభుత్వం వ్యవహరించడం శోచనీయమని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ రావు అన్నారు.

By అంజి  Published on  28 Aug 2024 11:14 AM IST
Telangana government, anti farmer policies, BRS leader Harish Rao

'హామీలకు మంగళం.. రైతన్నకు మరోసారి మోసం'.. రేవంత్‌ సర్కార్‌పై హరీష్‌ రావు ఫైర్‌

ఆహార పంటల బదులు పప్పుధాన్యాల సాగుతో మెరుగైన లాభాలు సాధించవచ్చన్న రైతుల ఆశలు అడియాశలు చేసేలా కాంగ్రెస్‌ ప్రభుత్వం వ్యవహరించడం శోచనీయమని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ రావు అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది క్వింటా పెసరకు మద్దతు ధర రూ. 8,682 ప్రకటించినప్పటికీ ఆ ధరకు ఎవరూ కొనుగోలు చేయని పరిస్థితి నెలకొందన్నారు. దీంతో వ్యవసాయ మార్కెట్లు, గ్రామీణ ప్రాంతాల వ్యాపారులకు పంటను క్వింటా రూ.6,000 నుంచి రూ.6,500 మధ్యనే రైతులు విక్రయిన్నారని, ప్రైవేటు వ్యాపారులు ఆడిందే ఆటగా మారటంతో రైతులు క్వింటాకు రూ.2,500 పైగా నష్టపోతున్నారని అన్నారు.

''మద్దతు ధరకు వ్యాపారులు పంటలు కొనుగోలు చేయని పరిస్థితుల్లో కేసీఆర్ ప్రభుత్వం మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, రైతులకు నష్టం జరగకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకునేది. దీంతో మార్కెట్ లో పోటీ ఏర్పడి వ్యాపారులు సైతం ఎక్కువగా చెల్లించి పంటలు కొనుగోలు చేసేవారు. కానీ ఈ సంవత్సరం మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలో మీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడం, కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో నిర్లక్ష్యం ప్రదర్శించడం పెసర పంట రైతులకు శాపంగా మారింది. కష్టపడి పండించిన పంటను మద్దతు ధరకు విక్రయించే పరిస్థితి లేదని ఖమ్మం, మహబూబాబాద్, వికారాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, నారాయణ పేట, సూర్యపేట తదితర జిల్లాల రైతులు తీవ్ర ఆవేదన, ఆందోళన చెందుతున్నారు. పంట మొత్తం అమ్ముకున్నాక కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే దళారులకు ఉపయోగంగా ఉంటుంది తప్ప రైతన్నలకు కాదన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలి'' అని హరీష్‌ రావు డిమాండ్‌ చేశారు.

''ఇప్పటికే రుణమాఫీ, రైతు బంధును అటకెక్కించిన కాంగ్రెస్‌ ప్రభుత్వం మద్దతు ధరకు అదనంగా రూ. 500 బోనస్ చెల్లిస్తామన్న మాటను బోగస్ చేశారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలకు మంగళం పాడారు. అదే తీరుగా ఇప్పుడు మద్దతు ధర ప్రకారం పంటలు కొనుగోలు చేసే బాధ్యతను విస్మరిస్తున్నారు. రైతుల నెత్తిన మరోసారి టోపీ పెడుతున్నారు. కాంగ్రెస్ పాలనలో పంటలు పండించడం, పండించిన పంటలను విక్రయించుకోవడం రైతన్నకు కత్తిమీద సాముగా మారింది'' అని అన్నారు.

''ఎన్నికలకు ముందు ఒక తీరుగా, అధికారంలోకి వచ్చాక మరొక తీరుగా వ్యవహరించడం కాంగ్రెస్ మోసపూరిత వైఖరికి నిదర్శనం. నమ్మి ఓటేసినందుకు నట్టేట ముంచుతున్న తీరును రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పటికైనా కళ్లు తెరిచి వ్యవసాయ, రైతు వ్యతిరేక విధానాలను వీడాలని, మార్క్ ఫెడ్ ద్వారా పెసర కొనుగోలు కేంద్రాలు జిల్లాల్లో తక్షణం ఏర్పాటు చేసి రైతులు నష్టపోకుండా చూడాలని బిఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం'' అని హరీష్‌ రావు అన్నారు.

Next Story