తెలంగాణలో విద్యా సంవత్సరం షెడ్యూల్ ఖరారైంది. 2023-24 పాఠశాల విద్యా సంవత్సరం షెడ్యూల్ను తెలంగాణ విద్యాశాఖ ఖరారు చేసింది. జూన్ 12 నుంచి విద్యా సంవత్సరం ప్రారంభమై, 2024 ఏప్రిల్ 24 చివరి పని దినంగా ప్రకటించింది. 2024 ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 తేదీ వరకూ వేసవి సెలవులుగా నిర్ణయించారు. తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ప్రతి నెల నాలుగో శనివారాన్ని నో బ్యాగ్ డేగా పాటించనున్నారు.ఆ రోజు పిల్లలు పుస్తకాల సంచి లేకుండా బడులకు రావాల్సి ఉంటుంది. ఏడాదిలో మొత్తం 10 రోజులపాటు పిల్లలు స్కూల్ బ్యాగ్స్ లేకుండా వస్తారు.
2023-24 లో మొత్తం 229 స్కూల్స్ నడవనున్నాయి. జనవరి 10 తేదీ లోపు పదో తరగతి సిలబస్ పూర్తి చేయాల్సి ఉంటుందని విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ తెలిపారు. మార్చిలో పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు. పాఠశాలల్లో ప్రతీ రోజూ విద్యార్థులకు ఐదు నిమిషాల పాటు యోగ, ధ్యానం తరగతులు ఉండనున్నాయి. అక్టోబర్ 14 నుంచి 25 వరకు దసరా సెలవులు, జనవరి 12 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు, డిసెంబర్ 22 నుంచి 26 తేదీ వరకూ క్రిస్మస్ సెలవులు ఉంటాయని ప్రకటించారు. ఒకటి నుంచి తొమ్మిది తరగతుల వారికి ఏప్రిల్ 8 నుంచి 18 వరకు ఎస్ఏ 2 పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు.