ప్రకృతి వ్యవసాయం చేసే వారికి నెలకు రూ.5,000.. తెలంగాణ సర్కార్ నిర్ణయం!
రాబోయే ఖరీఫ్ సీజన్ నుండి రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయాన్ని భారీ స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.
By - అంజి |
ప్రకృతి వ్యవసాయం చేసే వారికి నెలకు రూ.5,000.. తెలంగాణ సర్కార్ నిర్ణయం!
రాబోయే ఖరీఫ్ సీజన్ నుండి రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయాన్ని భారీ స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ (NMNF) లో భాగంగా మొత్తం 61,125 ఎకరాల్లో ప్రకృతి పద్ధతుల్లో సాగు చేసేలా రైతులను ప్రోత్సహిస్తున్నారు. మంగళవారం (మార్చి 17) వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకృతి వ్యవసాయానికి ఎంపికైన రైతులతో వర్చువల్ విధానంలో ముచ్చటించి, వారి అనుభవాలను, ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రకృతి సిద్ధంగా పండించిన పంటలకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో, మిషన్ మోడ్‌లో దీనిని అమలు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
ఈ ప్రతిష్టాత్మక పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా 489 క్లస్టర్లలో దాదాపు ₹42 కోట్ల వ్యయంతో అమలు చేయనున్నారు. ఎంపికైన రైతులకు ముందుగా నిర్ణయించిన రైతు వేదికల ద్వారా ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. రైతులకు సహాయం చేయడానికి ప్రతి క్లస్టర్‌లో ప్రకృతి వ్యవసాయం మరియు మార్కెటింగ్‌పై అవగాహన ఉన్న ఇద్దరు వ్యక్తులను నియమిస్తారు. వారికి నెలకు ₹5,000 గౌరవ వేతనం కూడా ప్రభుత్వం చెల్లిస్తుంది. క్షేత్రస్థాయిలో రైతులకు ఎప్పటికప్పుడు సలహాలు అందించడమే వీరి ప్రధాన బాధ్యత.
ప్రకృతి వ్యవసాయానికి అత్యంత అవసరమైన బీజామృతం, జీవామృతం, దశపర్ణి వంటి జీవ ఎరువులు, కషాయాల తయారీ కోసం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. సొంతంగా వీటిని తయారు చేసుకోలేని రైతుల కోసం ఒక్కొక్కటి ₹1 లక్ష వ్యయంతో బయో-ఇన్ పుట్ రిసోర్స్ సెంటర్లను (BRCs) ఏర్పాటు చేయనున్నారు. ఈ పథకానికి ఎంపికైన 61,125 మంది రైతులకు మంగళవారం రైతు వేదికల వద్ద సాగుకు అవసరమైన కిట్‌లను కూడా పంపిణీ చేశారు.