హైదరాబాద్: రాష్ట్ర పండుగ సద్దుల బతుకమ్మ వేడుకలపై ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 30న (మంగళవారం నాడు) బతుకమ్మ నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. ప్రజలకు అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఇప్పటికే ఆ రోజున పబ్లిక్ హాలిడేగా ప్రకటించిన విషయం తెలిసిందే.
అయితే బతుకమ్మ ఏ రోజున జరుపుకోవాలన్న సందిగ్ధం చాలా మందిలో ఉంది. కొన్ని చోట్ల సోమవారం నాడు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. కాగా ఈసారి సద్దుల బతుకమ్మ ఎప్పుడు జరుపుకోవాలన్న దానిపై అర్చకుల అభిప్రాయాలు భిన్నంగా రావడంతో ప్రజల్లో కొంత గందరగోళం నెలకొంది. కొందరు అర్చకులు 9వ రోజు అయిన 29వ తేదీన సద్దుల బతుకమ్మ జరుపుకోవాలని చెబుతుండగా.. మరికొందరు అర్చకులు అష్ఠమి అయిన ఈ నెల 30వ తేదీన జరుపుకోవాలని చెబుతున్నారు.
ఎప్పుడూ లేని విధంగా ఈ సంవత్సరం సద్దుల బతుకమ్మ విషయంలో కాస్త క్లారిటీ లేకుండా పోయింది. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ నెల 30వ తేదీన పెద్ద బతుకమ్మ (సద్దుల బతుకమ్మ) జరుపుకోవాలని ప్రకటన చేసింది. అటు దసరా పండుగ మాత్రం అక్టోబర్ 2వ తేదీనే జరుపుకోనున్నారు. అయితే ఈ సారి బ్యాడ్ న్యూస్ ఎంటంటే.. అదే రోజు గాంధీ జయంతి రావడంతో.. మద్యం, మాంసం విక్రయాలపై నిషేధం ఉండనుంది.