హైదరాబాద్: కొత్త రేషన్ కార్డుల పంపిణీకి ప్రభుత్వం సిద్ధమవుతోంది. రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ ఇస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. గడిచిన 6 నెలల్లో 41 లక్షల మందికి కొత్తగా రేషన్ అందించినట్టు పేర్కొన్నారు. ఈ నెలలో మరో 2.4 లక్షల కొత్త కార్డులు పంపిణీ చేస్తామన్నారు. వీటి ద్వారా మరో 11.30 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందని ట్వీట్ చేశారు. ఈ నెల 14న సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ జరిగే సభలో సీఎం రేవంత్ రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించనున్నారు. ఆ తర్వాత.. అన్ని నియోజకవర్గాల్లోనూ ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది.
నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేల ద్వారా నిర్వహించే దిశగా ప్రభుత్వం కార్యాచరణను సిద్ధం చేసింది. ఇందుకు అనుగుణంగా కొత్త కార్డులను నేరుగా లబ్ధిదారులకు పంపిణీ చేస్తారు. పంపిణీ చేసే తేదీలతో పాటు ప్రాంతాలను స్థానిక అధికారులు ప్రకటిస్తారు.రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత.. రేషన్ కార్డులపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. స్మార్ట్ కార్డుల రూపంలో రేషన్ కార్డులను ఇవ్వాలని కూడా నిర్ణయించింది. కొత్త కార్డులతో పాటు, ఇప్పటికే ఉన్న కార్డుల స్థానంలో క్యూఆర్ కోడ్‌తో ఉన్న స్మార్ట్ రేషన్‌కార్డులను అందించే దిశగా పౌరసరఫరాల శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు.