తెలంగాణ ప్రభుత్వ కీలక నిర్ణయం.. నేటి నుంచి రెండో డోసు వారికే టీకాలు.. స్లాట్ బుకింగ్ అవసరం లేదు
Telangana Government key decision on vaccination.తెలంగాణ ప్రభుత్వం వ్యాక్సినేషన్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.
By తోట వంశీ కుమార్ Published on 8 May 2021 8:54 AM ISTతెలంగాణ ప్రభుత్వం వ్యాక్సినేషన్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో నేటి నుంచి కొవిడ్ టీకాలను రెండో డోసు వారికే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 15వ తేదీ వరకు కరోనా టీకా మొదటి డోసు ఆపివేస్తున్నట్లు వెల్లడించింది. దీంతో కొవిషీల్డ్ వేయించుకుని 6 వారాలు గడిచిన వారికి.. కొవాగ్జిన్ తీసుకుని 4 వారాలు నిండినవారికి టీకాలను వేయనున్నారు. పరిస్థితి తీవ్రతను, టీకాల లభ్యతను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. అర్హులైన వారందరూ.. స్లాట్ బుకింగ్‌తో సంబంధం లేకుండా నేరుగా సమీపంలోని ప్రభుత్వ వ్యాక్సిన్ కేంద్రానికి వెళ్లొచ్చునని తెలిపింది.
ఈ నెల 15వ తేదీ వరకు ఎవరికీ స్లాట్ బుకింగ్ ఉండదని.. ఇప్పటి వరకు నమోదు చేసుకున్న అన్ని బుకింగ్స్‌ను రద్దు చేసినట్లు తెలిపారు. ఈ మేరకు బుకింగ్ చేసుకున్న వారికి మేసెజ్‌లు పంపినట్లు తెలిపారు. ఆ తరువాత అప్పటి పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. కోఠిలోని ఆరోగ్య కేంద్రంలో ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు, వైద్య విద్య సంచాలకులు డాక్టర్ రమేశ్ రెడ్డి విలేకరుల సమావేశంలో తెలిపిన వివరాల మేరకు.. రాష్ట్రంలో ఈ నెల 31 నాటికి రెండో తీసుకోవాల్సిన వారు 19,92,257 మంది ఉన్నారని.. ఇందులో కొవిషీల్డ్ పొందాల్సి ఉన్న వారు 16,61,543 మందిఉండగా.. కొవాగ్జిన్ తీసుకోవాల్సిన వారు 3,30,714 మంది ఉన్నారన్నారు.
ఈ నెల 15 వరకు తీసుకున్న రెండో డోసు పొందాల్సి ఉన్న గణాంకాలను పరిశీలించినా.. 4,99,432 మంది ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3,74,900 డోసుల టీకా నిల్వలు మాత్రమే ఉన్నాయని.. అప్పటి దాకా రెండో డోసు వారికే టీకాలు ఇస్తామన్నారు. ఈ నెల 15 నాటికి మరో 3,11,000 టీకా డోసులు వచ్చే అవకాశాలున్నాయన్నారు. ఈ పరిస్థితుల్లో మే నెలాఖరు వరకు రెండో డోసు వారికే టీకాలు సరిపోని స్థితి ఉందన్నారు. వీటిన్నంటినీ దృష్టిలో పెట్టుకునే ప్రస్తుతానికి రెండో డోసు వారికి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు.