Telangana: సర్కార్ బడుల్లో తగ్గుతున్న అడ్మిషన్లు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల గురించి సోషల్ మీడియాలో ప్రచారం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
By అంజి Published on 3 Feb 2025 10:04 AM ISTTelangana: సర్కార్ బడుల్లో తగ్గుతున్న అడ్మిషన్లు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
హైదరాబాద్: ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల గురించి సోషల్ మీడియాలో ప్రచారం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ విద్యా సంస్థల్లో అందిస్తున్న ఫెసిలిటీస్, వస్తున్న ఫలితాల గురించి ప్రజలకు తెలిసేలా వివరించనుంది. స్కూళ్లలో అడ్మిషన్లు పెరిగే చర్యలు తీసుకోనుంది. దీని కోసం ఫేస్‌బుక్, ఎక్స్, వాట్సాప్ వంటి సోషల్ మీడియా వేదికల్లో స్పెషల్ గ్రూపులను క్రియేట్ చేయనుంది.
రాష్ట్ర స్థాయితో పాటు జిల్లా, మండల, స్కూల్ లెవెల్లోనూ వీటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వీటిని ప్రత్యేక అధికారులు పర్యవేక్షిస్తారని సమాచారం. ప్రతి ఏటా పాఠశాలల పునఃప్రారంభానికి ముందు ప్రభుత్వం బడిబాట కార్యక్రమం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే దీనికి పెద్దగా ఆదరణ రావడం లేదు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాలు ఉన్నాయి. తెలుగుతో పాటు ఇంగ్లీష్ మీడియంలో బోధన జరుగుతోంది. అయినా కూడా ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పెరగడం లేదు. ఈ క్రమంలోనే ప్రభుత్వం ఈసారి ప్రత్యేక చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది.
రాష్ట్రంలో ప్రభుత్వ, లోకల్ బాడీ, కేజీబీవీ, మోడల్ స్కూల్ వంటి విద్యా సంస్థలు 26,856 ఉన్నాయి. వీటిలో సుమారు 20 లక్షల మంది వరకు చదువుతున్నారు. అలాగే 11,500 ప్రైవేటు స్కూళ్లుంటే, వాటిలో 34 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. మరోపక్క ఇంటర్మీడియెట్ లోనూ 424 సర్కారు కాలేజీలు ఉండగా.. వాటిలో లక్షన్నర మంది విద్యార్థులు చదువుతున్నారు. 1400 ప్రైవేటు కాలేజీల్లో 7 లక్షల మంది చదువుతున్నారు. కాగా.. ఏటా ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదివే విద్యార్థుల సంఖ్య తగ్గుతుండగా, ప్రైవేటు సంస్థల్లో పెరుగుతోంది.