చేనేత కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో నూలు డిపోల ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రూ.50 కోట్ల నిధులు మంజూరు చేసింది. రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్ శనివారం జీవో విడుదల చేశారు. దీని ద్వారా రూ.30 వేల మరమగ్గాల కార్మికులకు లబ్ధి చేకూరుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ప్రభుత్వ నిర్ణయంపై నేతన్నలు హర్షం వ్యక్తం చేశారు.
దీంతో ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న చేనేత కార్మికుల కోరిక నెరవేరింది. ఈ యారన్ డిపో టెస్కో ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. మరమగ్గాల కార్మికులకు అవసరమగు నూలును టెస్కో క్రెడిట్ పద్ధతిలో సరఫరా చేసి వస్త్రాన్ని కొనుగోలు చేయనుంది. యారన్ డిపో (నూలు డిపో)ను ఏర్పాటు చేయడం వలన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలలోని వేల సంఖ్యలో మరమగ్గాల కార్మికులకు ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి.