తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. నీటిపారుదల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ (అడ్మిన్)గా ఓ.వి రమేశ్ బాబును నియమించింది. ఈ మేరకు నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా ఉత్తర్వులు జారీ చేశారు. ఈఎన్సీగా నియమితులైన రమేశ్ బాబు ప్రస్తుతం సూర్యాపేట, ఖమ్మం చీఫ్ ఇంజినీర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.
కాగా, మేడిగడ్డ బ్యారేజీ గ్రౌటింగ్‌కు సంబంధించి ఈఎన్సీగా అనీల్ కుమార్ ఇటీవలే కాళేశ్వరం జ్యుడీషియల్ కమిషన్ ఎదుట విచారణకు హాజరైన విషయం తెలిసిందే. దీంతో ఆయనను ఈఎన్సీ పదవి నుంచి తప్పిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రస్తుతం ఆయనకు ఎలాంటి పోస్టింగ్ కేటాయించకుండా ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాలని ఆర్డర్‌లో పేర్కొన్నారు. అయితే, ప్రస్తుతం ఈఎన్సీ పోస్ట్ ఖాళీగా ఉండటంతో ఆ స్థానంలో సూర్యాపేట, ఖమ్మం చీఫ్ ఇంజినీర్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఓ.వి రమేశ్ బాబుకు ఈఎన్సీగా అదనపు బాధ్యతలను అప్పగించారు.