Telangana: రేషన్ కార్డుల దరఖాస్తులకు బ్రేక్!
హైదరాబాద్: కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించాలన్న నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం మార్చుకుందని సమాచారం.
By అంజి Published on 3 Oct 2024 6:17 AM IST
Telangana: రేషన్ కార్డుల దరఖాస్తులకు బ్రేక్!
హైదరాబాద్: కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించాలన్న నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం మార్చుకుందని సమాచారం. ఈ నెల 2వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరించాల్సి ఉండగా, ఇందుకు సంబంధించిన ప్రక్రియను నిలిపివేసింది. ఫ్యామిలీ డిజిటల్ కార్డులు ఇవ్వనున్న నేపథ్యంలో ఇక రేషన్ కార్డులు అవసరం లేదని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. మరోవైపు అధికారులు నేటి నుంచి 5 రోజుల పాటు ఫ్యామిలీ డిజిటల్ కార్డుల పైలట్ ప్రాజెక్టు చేపట్టనున్నారు.
ఫ్యామిలీ డిజిటల్ కార్డుల జారీ ప్రక్రియలో కుటుంబ సభ్యుల వివరాల నమోదులో ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు. డిజిటల్ కార్డుల కోసం చేపడుతున్న పైలెట్ ప్రాజెక్టు ద్వారా వెల్లడయ్యే అనుభవాల ఆధారంగా సానుకూల, ప్రతికూల అంశాలపై సమగ్రమైన నివేదిక తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. పైలెట్ ప్రాజెక్టు ప్రాతిపదికన ఏవైనా లోపాలుంటే సవరించుకుని పూర్తి స్థాయిలో చేపట్టాలని సూచించారు. ప్రతి నియోజకవర్గంలో ఒక అర్బన్, ఒక రూరల్ ప్రాంతాలను ప్రాతిపదికగా ఎంపిక చేసుకుని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇప్పటికే గుర్తించిన 238 ప్రాంతాల్లో బృందాలు క్షేత్రస్థాయిలో పరిశీలన జరపాలని ఆదేశించారు.
అక్టోబర్ 3 నుంచి 7 వ తేదీ వరకు అయిదు రోజుల పాటు పైలెట్ ప్రాజెక్టు చేపట్టే ప్రాంతాల్లో కుటుంబ సభ్యులు అందరూ సమ్మతిస్తే ఫోటో తీయాలని, అది ఒక ఆప్షన్ గా మాత్రమే ఉండాలని చెప్పారు. రేషన్ కార్డు, పింఛను-స్వయం సహాయక సంఘాలు, రైతు భరోసా, రుణమాఫీ, బీమా, ఆరోగ్యశ్రీ, కంటి వెలుగు వంటి కార్యక్రమాల్లో నమోదైన డేటా ఆధారంగా ఇప్పటికే కుటుంబాల గుర్తింపునకు సంబంధించిన ప్రక్రియ పూర్తయింది.