తెలంగాణలో పాఠశాలల పనివేళల్లో మార్పులు
తెలంగాణలో పాఠశాలల పనివేళలను మారుస్తూ సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం పాఠశాలలు ఉదయం 9 గంటలకు మొదలవుతున్నాయి.
By అంజి
తెలంగాణలో పాఠశాలల పనివేళల్లో మార్పులు
హైదరాబాద్: తెలంగాణలో పాఠశాలల పనివేళలను మారుస్తూ సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం పాఠశాలలు ఉదయం 9 గంటలకు మొదలవుతున్నాయి. దీన్ని ప్రభుత్వం 9.30 గంటలకి విద్యాశాఖ మారుస్తూ నిర్ణయం తీసుకున్నది. ప్రాథమిక పాఠశాలల సమయం ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4.15వరకు మార్చింది. ఉన్నత పాఠశాలలు ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4.45 వరకు మారుస్తూ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పనివేళ్లల్లో మార్పులు చేసినట్లు వెల్లడించింది. ఈ పని వేళలు జంట నగరాలకు మినహా రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు వర్తించనున్నదని ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రస్తుతం ప్రాథమిక పాఠశాలలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు, ఉన్నత పాఠశాలలు 9.30 నుంచి సాయంత్రం 4.45 వరకు నడుస్తున్నాయి.
ఈ సమయాల్లో విద్యాశాఖ మార్పులు చేసింది. పనివేళల్లో మార్పుల ఉత్తర్వులను అన్ని జిల్లాల డీఈవోలు, ఆర్‌జేడీఎస్‌ఈలకు విద్యాశాఖ పంపించింది. విద్యాశాఖ పాఠశాలల సమయాల్లో చేసిన మార్పులు తక్షణమే అమల్లోకి వస్తాయని ప్రకటించింది. అయితే స్కూళ్ల పనివేళల్లో మార్పులపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. హైస్కూల్ పాఠశాలలకు పక్క ఊళ్ల నుంచి విద్యార్థులు వస్తారు కాబట్టి వారికోసం కాస్త ఆలస్యంగా తరగతులు మొదలుపెట్టినా సమస్యలేదంటున్నారు. ప్రాథమిక పాఠశాలలు ఊళ్లోనే ఉంటాయి కాబట్టి ఆలస్యంగా మొదలుపెట్టాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. రాష్ట్రంలో అధిక వర్షాలు కురవడంతో ఇప్పటికే ప్రభుత్వం పాఠశాలలకు కలిపి మూడు రోజులు సెలవులు ఇచ్చింది. ఆదివారంతో కలిసి నాలుగు రోజులు ఇచ్చినట్లయ్యింది.