వాహనాలపై అనధికారికంగా స్టిక్కర్లు..తెలంగాణ ప్రభుత్వం కీలక ఆదేశాలు
వాహనాలపై అనధికారికంగా ప్రెస్, న్యాయవాది, మానవ హక్కుల కమిషన్ వంటి పేర్లు, లోగోలు, జెండాలు, స్టిక్కర్లు వాడడాన్ని తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా నిషేధించింది.
By - Knakam Karthik |
వాహనాలపై అనధికారికంగా స్టిక్కర్లు..తెలంగాణ ప్రభుత్వం కీలక ఆదేశాలు
హైదరాబాద్ : వాహనాలపై అనధికారికంగా ప్రెస్, న్యాయవాది, మానవ హక్కుల కమిషన్ వంటి పేర్లు, లోగోలు, జెండాలు, స్టిక్కర్లు వాడడాన్ని తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా నిషేధించింది. జనవరి 22వ తేదీన తెలంగాణ సమాచార మరియు ప్రజాసంబంధాల శాఖ జారీ చేసిన మెమోలో ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ అధికారిక గుర్తింపు లేకుండా వాహనాలపై ప్రెస్ అనే పదాన్ని వినియోగించడం చట్టవిరుద్ధమని, ఇది అధికార హోదాను తప్పుగా చూపించిన నేరంగా పరిగణిస్తామని మెమోలో పేర్కొన్నారు.
తెలంగాణ సమాచార మరియు ప్రజాసంబంధాల శాఖ స్పష్టం చేసిన ప్రకారం, శాఖ నుంచి అధికారిక గుర్తింపు పొందిన మీడియా ప్రతినిధులకు మాత్రమే తమ వాహనాలపై ప్రెస్ గుర్తు వాడుకునే అనుమతి ఉంటుంది. గుర్తింపు లేని వ్యక్తులు, సంస్థలు ఈ గుర్తులను వినియోగిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది. అలాగే కేంద్ర మోటారు వాహన నిబంధ నల ప్రకారం వాహన నంబర్ ప్లేట్లపై అదనపు అక్షరాలు, గుర్తులు లేదా ప్రెస్ అనే పదం ఉండ కూడదని స్పష్టం చేసింది.
నిబంధనలను అతిక్రమించి అనధికారికంగా ప్రెస్ గుర్తులు వాడితే, అది అధికారిక హోదాను తప్పుగా చూపించే నేరంగా పరిగణించి కఠిన చర్యలు తీసు కుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది. వాహనాల తనిఖీల సమయంలో ఇలాంటి ఉల్లంఘనలు గుర్తిస్తే కేసులు నమోదు చేయాలని, అవసరమైతే వాహనాలను స్వాధీనం చేసుకునే అధికారం కూడా సంబంధిత అధికారులకు ఉంటుందని మెమోలో పేర్కొన్నారు. అనధికార గుర్తుల దుర్వినియోగం వల్ల ప్రజల్లో గందరగోళం, భద్రతా సమస్యలు తలెత్తుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ నిబంధనలపై ప్రజలకు, మీడియా ప్రతినిధులకు పూర్తి స్థాయి అవగాహన కల్పించాలని అన్ని జిల్లాల సమాచార మరియు పౌర సంబంధాల అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని మెమోలో స్పష్టం చేసింది.