అసంపూర్తి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు శుభవార్త

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలోనూ, గత ప్రభుత్వ హయాంలోనూ ఇళ్లు మంజూరై.. పలు కారణాలతో నిర్మాణాలు మధ్యలోనే ఆగిపోయిన వేలాది మంది లబ్ధిదారులకు...

By -  అంజి
Published on : 17 Feb 2026 9:22 AM IST

Telangana Indiramma Indlu Scheme, Incomplete Houses Funding, Revanth Reddy Govt Housing, Telangana Housing News Telugu, Indiramma Houses Update

అసంపూర్తి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు శుభవార్త 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలోనూ, గత ప్రభుత్వ హయాంలోనూ ఇళ్లు మంజూరై.. పలు కారణాలతో నిర్మాణాలు మధ్యలోనే ఆగిపోయిన వేలాది మంది లబ్ధిదారులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. అలాంటి అసంపూర్తి నిర్మాణాలను ‘ఇందిరమ్మ ఇళ్ల’ పథకం కింద పూర్తి చేయాలని కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా గతంలో ఇళ్లు మంజూరై, బేస్‌మెంట్‌ (పునాది) స్థాయి వరకు నిర్మించి ఆగిపోయిన ఇళ్లు సుమారు 9 వేల వరకు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది.

ప్రభుత్వాలు మారడం, నిధుల విడుదల నిలిచిపోవడం లేదా లబ్ధిదారుల ఆర్థిక పరిస్థితి సహకరించకపోవడంతో ఈ ఇళ్లు ఏళ్ల తరబడి అసంపూర్తిగా మిగిలిపోయాయి. ఇప్పుడు వీరందరినీ ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో చేర్చి ఆర్థిక సాయం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సాధారణంగా కొత్తగా నిర్మించే ఇందిరమ్మ ఇళ్లకు ప్రభుత్వం రూ.5 లక్షల ఆర్థిక సాయం అందజేస్తుంది. అయితే, అసంపూర్తిగా ఉన్న ఇళ్ల విషయంలో ప్రభుత్వం చిన్న మార్పు చేసింది.

ఇప్పటికే పునాది లెవల్ వరకు నిర్మాణం పూర్తయినందున, ఆ ఖర్చును రూ.లక్షగా పరిగణించి మినహాయిస్తారు. మిగిలిన నిర్మాణ పనుల కోసం (గోడలు, స్లాబ్, ఫినిషింగ్) ప్రభుత్వం లబ్ధిదారులకు రూ.4 లక్షల వరకు విడతల వారీగా అందజేయనుంది. ఈ లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి అవకతవకలు జరగకుండా అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన జరుపుతున్నారు. నిజమైన లబ్ధిదారులను గుర్తించి, వారి బ్యాంక్ ఖాతాలకు నేరుగా నగదు బదిలీ చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. పదేళ్లుగా శిథిలావస్థకు చేరుకుంటున్న తమ ఇళ్లను పూర్తి చేసుకునే అవకాశం రావడంతో వేలాది కుటుంబాల్లో హర్షం వ్యక్తమవుతోంది.

Next Story