లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (ఎల్‌ఆర్‌ఎస్) ఫీజును 25 శాతం రాయితీతో చెల్లించేందుకు ఇచ్చిన గడువును ప్రభుత్వం మరోసారి పొడిగించింది. ఈ నెల 31వ తేదీ వరకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో వన్ టైమ్ సెటిల్‌మెంట్ ప్రకటించిన ప్రభుత్వం.. తొలుత మార్చి 31 వరకు గడువు ఇచ్చింది. ఆ తర్వాత దాన్ని ఏప్రిల్ 30కి, అనంతరం మే 3వ తేదీకి, తాజాగా మే 31 వరకు పొడిగించింది.
26 ఆగస్టు 2020కు ముందు అక్రమ లే అవుట్లను.. ఎల్‌ఆర్‌ఎస్ స్కీం కింద క్రమబద్ధీకరిస్తారు. లే అవుట్‌లోని ప్లాట్లలో కనీసం 10 శాతం ఇప్పటికే విక్రయించి ఉండాలి. ఇప్పటికే రూ.1000 చెల్లించి దరఖాస్తు చేసుకున్న వారు.. ఇప్పటి వరకు ఎల్‌ఆర్‌ఎస్ కోసం దరఖాస్తు చేసుకోని వారు సైతం క్రమబద్ధీకరణ చేసుకోవచ్చు. సంబంధిత ప్రాంతంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఫీజు చెల్లించి ప్రక్రియ పూర్తి చేయాలి.
రిజిస్ట్రేషన్ చేసే ముందు.. సంబంధిత లే అవుట్ లేదా అందులో ప్లాట్లు చెరువుల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌తో పాటు నిషేధిత జాబితా, ఇతర ఎలాంటి వివాదాల్లో లేవని నీటిపారుదల శాఖ, రెవెన్యూ, హెచ్‌ఎండీఏ అధికారులు నిరంభ్యంతర పత్రం ఇవ్వాలి. వీటినే లెవల్ -1 అనుమతుల కింద భావిస్తారు.