ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో విచారణ నిమిత్తం స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం(సిట్)ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ నేతృత్వంలో ఈ బృందాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇందులో ఆరుగురు పోలీసు అధికారులను కూడా భాగస్వామ్యులను చేసింది. ఫాం హౌస్ కేసులో హైకోర్టు స్టే ఎత్తివేయడంతో వెంటనే ప్రభుత్వం స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం ను ఏర్పాటు చేసింది. మొయినాబాద్ ఫాం హౌస్ కేసును రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ కొనుగోళ్ల వ్యవహారంలో కీలక సూత్రదారులెవరు? మొత్తం వ్యవహారంలో ఎంతమంది ప్రమేయం ఉందనే విషయమై సిట్ బృందం ఆరా తీయనుంది. జైల్లో ఉన్న నిందితులను సిట్ బృందం కస్టడీలోకి తీసుకుని విచారించే అవకాశాలున్నాయని తెలుస్తోంది.