తెలంగాణకు ఏడేళ్లు పూర్తి..
Telangana formation day state complete 7 years.తెలంగాణ రాష్ట్రం.. ఈ ప్రాంత ప్రజలు కన్న కళ. ఎన్నో ఉద్యమాలు,
By తోట వంశీ కుమార్ Published on 2 Jun 2021 10:45 AM ISTతెలంగాణ రాష్ట్రం.. ఈ ప్రాంత ప్రజలు కన్న కళ. ఎన్నో ఉద్యమాలు, మరెన్నో పోరాటాలు, ఎందరో అమరవీరుల ప్రాణ త్యాగఫలితంగా ఆవిర్భవించిన రాష్ట్రం తెలంగాణ. నీళ్లు, నిధులు, నియామకాలే లక్ష్యంగా ఏర్పాటైన 29వ రాష్ట్రం. నేడు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం. ఈ రోజుతో ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడి ఏడేళ్లు పూర్తి అయ్యాయి. గత ఏడేళ్లుగా ప్రజల ఆకాంక్షల కోసం పనిచేస్తూ దేశానికే తలమానికంగా నిలిచింది. అభివృద్ది పథంలో తెలంగాణ ముందుకెళుతోంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నీళ్లు, నిధులు, నియామకాల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని తెరాస పార్టీ అధినేత, ప్రస్తుత సీఎం కేసీఆర్ 2001 ఏప్రిల్ 27న పార్టీ ఏర్పాటు చేసి ఉద్యమం చేపట్టారు. కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష, ఎందరో యువకుల బలిదానం.. సుదీర్ఘ పోరాటం తర్వాత 2014 జూన్ 2న తెలంగాణ స్వరాష్ట్ర ఆకాంక్ష సాకారమైంది. తెలంగాణ ఏర్పాటు తర్వాత జరిగిన ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ ఘనవిజయం సాధించింది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసినప్పటికి ఎన్నో సవాళ్లను ఎదురొడ్డుతూ తనదైన శైలిలో రాష్ట్రాన్ని ముందుకు నడిపించారు.
ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్రరాష్ట్రం వేరుపడిన సమయంలో తెలంగాణ కలిసేందుకు ఒప్పుకోలేదు. కానీ 58 ఏళ్ల పాటు అణచివేతకు గురైంది. 1969లో తొలిదశ ఉద్యమం తీవ్రస్థాయికి చేరింది. ఓయూలో విద్యార్థుల పోరాటం, మృతితో పీక్ కు చేరింది. తర్వాత మరుగునపడిపోయింది. ప్రొఫెసర్ జయశంకర్ సార్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి గొంతెత్తి నినాదించారు. ఈ సమయంలోనే 2001 ఏప్రిల్ 21వ తేదీన కేసీఆర్ డిప్యూటీ స్పీకర్ పదవీకి రాజీనామా చేసి.. మలిదశ తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ఏప్రిల్ 27వ తేదీన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని ఏర్పాటు చేశారు. 2004లో టీఆర్ఎస్‌తో కాంగ్రెస్ పార్టీ పెత్తు పెట్టుకుంది. దీంతో తెలంగాణ జాతీయ ఎజెండాగా మారింది. ప్రత్యేక రాష్ట్రం కోసం 2009 నవంబర్ 29వ తేదీన కేసీఆర్ ఆమరణ దీక్ష ప్రారంభించారు. కేసీఆర్ దీక్షకు యావత్ తెలంగాణ సమాజం మద్దతు పలికింది. నవంబర్ 29 వ తేదీ నుంచి ఉద్యమం తీవ్రస్థాయికి చేరింది. కేసీఆర్ నిమ్స్‌లో దీక్ష కొనసాగించడంతో.. డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నామని కేంద్ర హోంమంత్రి చిదంబరం ప్రకటించారు. దీంతో కేసీఆర్ దీక్ష విరమించారు.