ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు.. అమరవీరులకు సీఎం కేసీఆర్ నివాళులు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా.. రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా హైదరాబాద్ నగరంలోని గన్‌పార్క్ దగ్గర
By అంజి Published on 2 Jun 2023 11:30 AM ISTఘనంగా తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు.. అమరవీరులకు సీఎం కేసీఆర్ నివాళులు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా.. రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా హైదరాబాద్ నగరంలోని గన్‌పార్క్ దగ్గర తెలంగాణ అమరవీరులకు సీఎం కేసీఆర్ ఘనంగా నివాళులు అర్పించారు. అమరవీరుల స్థూపం దగ్గర పుష్పాంజలి ఘటించిన సీఎం కేసీఆర్.. రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. అక్కడి నుంచి సచివాలయానికి బయల్దేరారు. అంతకుముందు తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది వేడుకలను ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. మహాత్మాగాంధీ, బీఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ అంజనీ కుమార్, ప్రగతి భవన్ అధికారులు పాల్గొన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్‌లో మంత్రి కేటీఆర్ జాతీయ జెండా ఆవిష్కరించారు. అంతకుముందు పోలీసులు గౌరవ వందనం స్వీకరించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. సిద్దిపేట జిల్లాలో కలెక్టరేట్‌లో జరిగిన దశాబ్ది ఉత్సవాల్లో మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. పోలీసుల గౌరవవందనం స్వీకరించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం రైతులకు అండగా నిలిచిందని చెప్పారు. గతంలో చెరువులు ఎండిపోయి ఉండేవని.. ఇప్పుడు నిండుగా మండుటెండల్లోనూ నిండుగా ఉన్నాయని చెప్పారు. మెదక్ కలెక్టరేట్‌లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
సూర్యాపేటలో మంత్రి జగదీశ్ రెడ్డి, నిజామాబాద్‌లో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, జగిత్యాలలో మంత్రి కొప్పుల ఈశ్వర్, సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో మంత్రి మహమూద్ అలీ, మహబూబాబాద్‌లో మంత్రి సత్యవతి రాథోడ్, నిర్మల్ జిల్లా కేంద్రంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఖమ్మం జిల్లా కలెక్టరేట్‌లో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, జనగామ జిల్లా కలెక్టరేట్‌లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జాతీయ జెండా ఆవిష్కరించారు. అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి కామారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.