తెలంగాణలో ఫుడ్ సేఫ్టీ దాడులు: పురుగులు పట్టిన జీడిపప్పు, ఈగలు వాలే బాదం పాలు!
తెలంగాణవ్యాప్తంగా సాగుతున్న ఆహార భద్రత తనిఖీల్లో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. మిఠాయిలు, పాల ఉత్పత్తుల తయారీలో పురుగులు...
By - అంజి |
తెలంగాణలో ఫుడ్ సేఫ్టీ దాడులు: పురుగులు పట్టిన జీడిపప్పు, ఈగలు వాలే బాదం పాలు!
తెలంగాణవ్యాప్తంగా సాగుతున్న ఆహార భద్రత తనిఖీల్లో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. మిఠాయిలు, పాల ఉత్పత్తుల తయారీలో పురుగులు పట్టిన జీడిపప్పు, గడువు ముగిసిన పదార్థాలు వాడుతున్నట్లు అధికారులు గుర్తించారు. రాష్ట్రవ్యాప్తంగా 109 మిఠాయి తయారీ కేంద్రాలు మరియు విక్రయశాలల్లో నిర్వహించిన ఈ మెరుపు దాడుల్లో మొత్తం 190 నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపారు. వివిధ జిల్లాల్లో అనుమానాస్పద స్థితిలో ఉన్న క్యాండీలు, చాక్లెట్లు, మ్యాంగో బైట్లు మరియు ఫ్లేవర్డ్ స్వీట్లను అధికారులు సీజ్ చేశారు. సుమారు 35 కిలోల గడువు ముగిసిన పదార్థాలను అక్కడికక్కడే ధ్వంసం చేశారు.
హైదరాబాద్‌లోని మల్లాపూర్ ప్రాంతంలో మార్చి 28న జరిగిన తనిఖీల్లో ఒక జీడిపప్పు రీప్యాకింగ్ ఏజెన్సీ బండారం బయటపడింది. అక్కడ సుమారు 36 కిలోల జీడిపప్పు పురుగులు పట్టి ఉండటంతో వెంటనే పారేయించారు. అలాగే దాదాపు ₹1.5 లక్షల విలువైన 210 కిలోల జీడిపప్పును నాణ్యతా లోపం ఉన్నట్లు అనుమానించి సీజ్ చేశారు. ఇదే మల్లాపూర్‌లోని కుల్ఫీ, ఫలూదా, బాదం పాలు తయారు చేసే మరో యూనిట్‌లో కూడా భయంకరమైన అపరిశుభ్ర వాతావరణం కనిపించింది. ఈగలు వాలుతున్న పరిస్థితుల్లో బాదం పాలు తయారు చేస్తుండటంతో, సుమారు 50 లీటర్ల కలుషిత పానీయాలను అధికారులు పారబోయించారు.
ఆహార పదార్థాల కొనుగోలు విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. విడివిడిగా అమ్మే లేదా బ్రాండ్ లేని మిఠాయిలను కొనవద్దని, ప్యాకింగ్‌పై గడువు తేదీని తప్పనిసరిగా గమనించాలని కోరారు. రంగు మారిన లేదా దుర్వాసన వస్తున్న పదార్థాల గురించి వెంటనే అధికారులకు ఫిర్యాదు చేయాలని తెలిపారు. కల్తీని అరికట్టేందుకు ఇలాంటి ఆకస్మిక దాడులు రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతాయని ఆహార భద్రత విభాగం స్పష్టం చేసింది.