తెలంగాణ వరదలు: 108 గ్రామాల ప్రజల్ని రక్షించిన సిబ్బంది
తెలంగాణలో ఆకస్మిక వరదల కారణంగా ప్రభావితమైన 108 గ్రామాలకు చెందిన మొత్తం 10,696 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
By అంజి Published on 28 July 2023 6:13 AM ISTతెలంగాణ వరదలు: 108 గ్రామాల ప్రజల్ని రక్షించిన సిబ్బంది
తెలంగాణలో ఆకస్మిక వరదల కారణంగా ప్రభావితమైన 108 గ్రామాలకు చెందిన మొత్తం 10,696 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అత్యంత ప్రభావిత ప్రాంతాల్లో ఒకటైన భూపాలపల్లిలోని మోరంచపలి గ్రామంలో ఇప్పటివరకు 600 మందిని రక్షించారు. వరద నీటిలో చిక్కుకున్న గ్రామంలోని ఆరుగురిని ఆర్మీ హెలికాప్టర్ ద్వారా రక్షించారు. పెద్దపల్లి జిల్లా మంథని గోపాల్‌పూర్ సమీపంలో ఇసుక క్వారీలో చిక్కుకుపోయిన 19 మంది కార్మికులను రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
పునరావాస కార్యక్రమాలు
గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తీవ్రంగా నష్టపోయిన ప్రాంతాల్లో సహాయక, పునరావాస కార్యక్రమాలు చేపట్టాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి టెలికాన్ఫరెన్స్‌లో ఆదేశించారు. ప్రయాణికులు చిక్కుకున్న రైల్వే స్టేషన్లు, బస్టాండ్ల వద్ద సహాయక కార్యక్రమాలు చేపట్టాలని ఆమె అన్నారు. "బ్లాంకెట్లు, బెడ్ షీట్లు, మందులు జిల్లాలకు పంపబడతాయి" అని ఆమె హామీ ఇచ్చారు. గత కొన్ని రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా జిల్లా ప్రభుత్వ యంత్రాంగంతో కలిసి పనిచేసినందుకు జిల్లా కలెక్టర్లను సిఎస్ అభినందించారు.
అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, జిల్లా ఆసుపత్రులు, ప్రైవేట్ ఆసుపత్రులు ప్రస్తుతానికి 24 గంటలు తెరిచి ఉంచాలని కోరారు. వివిధ జిల్లాల కలెక్టర్ల అభ్యర్థన మేరకు మరో నాలుగు హెలికాప్టర్లు, 10 ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలను కోరినట్లు ఆమె తెలిపారు.
వర్షాల సమయంలో సెల్ఫీలకు దూరంగా ఉండండి
భారీ వర్షాల సమయంలో ఎలాంటి దుర్ఘటనలు జరగకుండా తల్లిదండ్రులు తమ పిల్లలపై నిఘా ఉంచాలని తెలంగాణ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అంజనీకుమార్ కోరారు. గురువారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సెల్ఫీల కోసం నదులు, జలపాతాలు, వాగుల దగ్గరకు వెళ్లకుండా తమ ప్రాణాలకు ముప్పు తెచ్చుకోకుండా చూసుకోవాలన్నారు.
“ఇప్పటి వరకు, సుమారు 700 మందిని రక్షించి పునరావాస కేంద్రాలకు తరలించారు. వరద పరిస్థితిని మా బృందాలు నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి. తెలంగాణలోని మోరంచపలి వద్ద వరద పరిస్థితిపై, మొత్తం ఆరు ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి” అని డీజీపీ చెప్పారు. 85 ప్రాంతాల్లో జాతీయ రహదారులు, ఇతర రహదారులు దెబ్బతిన్నాయని, వాటికి మరమ్మతులు చేసేందుకు సంబంధిత శాఖల అధికారులు చర్యలు తీసుకుంటున్నారని డీజీపీ తెలిపారు.