వరద బీభత్సం.. హైదరాబాద్-వరంగల్ హైవేపై ఇబ్బందులు
హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై వాహనదారులు చుక్కలు చూస్తున్నారు.
By Srikanth Gundamalla Published on 27 July 2023 8:52 AM GMTవరద బీభత్సం.. హైదరాబాద్-వరంగల్ హైవేపై ఇబ్బందులు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా నదులు, చెరువులు వాగులు, వంకలు వరద నీటితో నిండి పొంగిపొర్లుతున్నాయి. వాగులను దాటుతూ చాలామంది ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారు. మూడు రోజులు కుంభవృష్టి ఉన్నట్లుగా వాతావరణ శాఖ వెల్లడించింది. అంతే కాకుండా ఇంటి నుండి ఎవరు బయటకు వెళ్ళకూడదు అంటూ హెచ్చరించారు. పోలీసుల సహాయం కోసం 100 డయల్ కి ఫోన్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు. ఎన్ని హెచ్చరికలు చేసినా కూడా కొంతమంది విధి నిర్వహణలో భాగంగా పనులు చేసుకోవడానికి వాగులు దాటి వెళుతున్నారు. దీంతో వారు ప్రమాదానికి గురి అవుతున్నారు. రహదారులపై సైతం వరద నీరు ప్రవహిస్తోంది. కొన్ని చోట్ల నీటి ప్రవాహానికి రోడ్డు కొట్టుకుపోయింది. దాంతో రాకపోకలకు అంతరాయం కలుగుతోంది.
హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై వాహనదారులు చుక్కలు చూస్తున్నారు. కుంభవృష్టిగా కురుస్తున్న వర్షాల కారణంగా ఫ్లై ఓవర్ నిర్మాణ పనుల్లో జాప్యం కావడంతో రోడ్లు మొత్తం పూర్తిగా గుంటలమయం అయ్యింది. దీంతో వరద నీరు రోడ్డుపై ఉన్న గుంతలలో చేరిపోయింది. దాంతో ఎక్కడ గుంతలు ఉన్నాయో.. ఎక్కడ రోడ్డు సాఫీగా ఉందో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. అలాగే భారీ వర్షాల కారణంగా కుత్బుల్లాపూర్ పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గాజుల రామారంలోని ఓక్షిత కాలనీలో ఉన్న ఇండ్లలోకి వరద నీరు భారీగా వచ్చి చేరింది. ఓక్షిత కాలనీ మొత్తం వరద నీటితో దిగ్బందమైంది. కాలనీవాసులు ఇంటి నుండి బయటకి రాలేని పరిస్థితి ఏర్పడింది. విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు సహాయం చర్యలు చేపట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు.
హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్తున్న హైవేపై పలుచోట్ల వర్షాలకు భారీగా నీరు నిలిచిపోయింది. దాంతో.. ఆ నీటిని తొలగించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్ని చోట్ల వర్షాలకు రోడ్లు కూడా దెబ్బతిని గుంతలు ఏర్పడ్డాయి. వాగులు ఉన్నచోట్ల వరద నీరు హైవేపై ప్రవహిస్తోంది. దాంతో.. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంకా వర్షాలు పడే సూచనలు ఉన్నాయని వాతావరణశాఖ చెబుతుండటంతో ఆందోళన చెందుతున్నారు.