Telangana: వరద బాధితుల అకౌంట్లలో రూ.16,500 జమ, డబ్బులు ఇంకా పడలేదా?
తెలంగాణలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో పెద్ద ఎత్తున వరదలు వచ్చాయి.
By Srikanth Gundamalla Published on 12 Sep 2024 3:22 AM GMTTelangana: వరద బాధితుల అకౌంట్లలో రూ.16,500 జమ, డబ్బులు ఇంకా పడలేదా?
తెలంగాణలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో పెద్ద ఎత్తున వరదలు వచ్చాయి. దాంతో.. భారీ ఆస్తినష్టం వాటిల్లింది. వరదల కారణంగా చాలా ఇళ్లు దెబ్బతిన్నాయి. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం వరద బాధితులను ఆదుకుంటోంది. తక్షణ సాయంగా ఒక్కో ఇంటికి రూ.16,500 అందిస్తోంది. నేరుగా ఈ డబ్బులను అకౌంట్లలోనే జమ చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. అయితే.. ఖమ్మం జిల్లాలో వరద ప్రభావం ఎక్కువగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అక్కడ మంగళవారం మధ్యాహ్నం నుంచి వరద బాధితుల అకౌంట్లలో డబ్బులు జమ చేస్తున్నారు అధికారులు. ఖమ్మం జిల్లాలో మొత్తం 15,258 ఇళ్లు ధ్వంసం అవ్వగా.. 12 ఇళ్లు పూర్తిగా కూలిపోయాయి. 15,096 ఇళ్లు, మరో 150 గుడిసెలు డ్యామేజ్ అయ్యాయిన అధికారుల సర్వేలో తేలింది.
ఇల్లు డ్యామేజీ అయిన వారికి రూ.16,500 చొప్పున, గుడిసెలు డ్యామేజీ అయిన వారికి రూ.18 వేల చొప్పున డబ్బులు జమ అవుతున్నాయి. మొత్తం బాధితుల కోసం రూ.25.33 కోట్లు జమ చేస్తున్నారు అధికారులు. అయితే.. ఇప్పటికీ డబ్బులు అకౌంట్లలో జమ కాని వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు అంటున్నారు. గురువారం సాయంత్రానికి ప్రతి ఒక్క వరద బాధితుడి అకౌంట్లలో ప్రభుత్వం అందిస్తోందన్న సాయం జమ అవుతుందని చెబుతున్నారు.