తెలంగాణలో ఓటర్ల తుది జాబితా విడుదల
తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో ఓటర్ల తుది జాబితాను విడుదల చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం.
By Srikanth Gundamalla Published on 4 Oct 2023 7:00 PM IST
తెలంగాణలో ఓటర్ల తుది జాబితా విడుదల
తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో ఓటర్ల తుది జాబితాను విడుదల చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం. రాష్ట్రంలో మొత్తం 3.17 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు వెల్లడించింది. ఇందులో పురుష ఓటర్ల సంఖ్య 1,58,71,493 కాగా.. మహిళా ఓటర్ల సంఖ్య 1,58,43,339గా ఉందని ఎన్నికల సంఘం తెలిపింది. ట్రాన్స్ జెండర్ల ఓటర్ల సంఖ్య 557 లక్షలు ఉన్నట్లు తెలిపింది. 6.10 లక్షల ఓట్లను తొలగించినట్లు వెల్లడించింది. ఓటర్ల జాబితా లింగ నిష్పత్తి 998:1000 గా ఉన్నట్లు ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. తద్వారా తెలంగాణలో మొత్తం 3,17,17,389 మంది ఓటర్లు ఉన్నట్లు తెలిపింది ఎన్నికల సంఘం.
జనవరితో పోలిస్తే 5, 8 శాతం ఓటర్ల సంఖ్య పెరిగినట్లు ఎన్నికల కమిషన్ తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా 6.10 లక్షల మంది ఓటర్లను తొలగించామని వెల్లడించింది. కొత్త ఓటర్ల సంఖ్య 17.01 లక్షలు ఉన్నట్లు తెలిపింది. తుది జాబితా ప్రకటించినప్పటికీ ఓటర్ల జాబితాను ఆధునీకరించే కసరత్తు కొనసాగుతుందని ఈసీ తెలిపింది. అర్హులైన వ్యక్తులు దరఖాస్తు చేసుకోవచ్చని ఎన్నికల సంఘం అధికారులు చెప్పారు. eci.gov.in వెబ్ సైట్ ద్వారా అప్లికేషన్ చేసుకోవచ్చని సూచించింది.
తెలంగాణలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సీఈసీ రాజీవ్‌కుమార్ నేతృత్వంలోని బృందం హైదరాబాద్ వచ్చిన విషయం తెలిసిందే. మంగళవారం నుంచి అసెంబ్లీ ఎన్నికలపై సీఈసీ బృందం సమీక్షింస్తోంది. ఈనెల 3న కలెక్టర్లు, ఎస్పీలతో ఎన్నికల బృందం సమావేశం అయ్యింది. ఈ నెల 5న సీఎస్, డీజీపీతో సీఈసీ బృందం సమావేశం కానుంది. ఆ తర్వాత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై రాజీవ్ కుమార్ మీడియాతో మాట్లాడనున్నారు. ఈ క్రమంలో ఈ నెల 6న లేదా 7వ తేదీన అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే చాన్స్ ఉందనే ప్రచారం జరుగుతోంది.