తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారిని కట్టడి చేయడం కోసం నైట్ కర్ఫ్యూను ప్రభుత్వం అమలు చేస్తూ ఉన్న సంగతి తెలిసిందే..! నైట్ కర్ఫ్యూ నేటితో ముగియనుండగా.. ఇంకొన్ని రోజులు పొడిగించాలనుకుంది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణలో నైట్ కర్ఫ్యూను మరో వారం రోజుల పాటు పొడిగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ శుక్రవారం మధ్యాహ్నం ఆదేశాలు జారీచేశారు.
నేడు కరోనా పరిస్థితులపై సీఎం కేసీఆర్ సమీక్ష జరిపి.. సీఎస్‌తో పాటు తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ, హోంశాఖ అధికారులతో కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించాల్సి ఉంది. ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంటారని అవసరమైతే వారం రోజులు మినీ లాక్‌డౌన్ విధిస్తారని ప్రచారం జరిగినప్పటికీ.. కోర్టులో విచారణ జరగడం.. వెంటనే నిర్ణయం తీసుకోవాలని ఆదేశించడంతో.. కేవలం నైట్ కర్ఫ్యూని పొడిగించింది రాష్ట్ర ప్రభుత్వం. ప్రస్తుతం ఉన్న నిబంధనలే మే 8 వరకు అమల్లో ఉంటాయి. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. రాత్రి 9 తర్వాత ఎవరూ బయట తిరగకూడదు. ఐతే అత్యవసర సేవలకు మాత్రం మినహాయింపు ఇచ్చారు.
తెలంగాణలో కరోనా కేసుల విజృంభణ కొనసాగుతోంది. మొన్న రాత్రి 8 గంటల నుంచి నిన్న రాత్రి 8 గంటల మధ్య 7,646 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించింది. అదే సమయంలో కరోనాతో 53 మంది ప్రాణాలు కోల్పోగా.. 5,926 మంది కోలుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,35,606 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 3,55,618 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 2,261గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 77,727 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 1,441 మందికి కరోనా సోకింది.