తెలంగాణ సర్కార్ బంపర్ ఆఫర్..ప్రభుత్వ ఉద్యోగులకు ఈవీ వాహనాలపై 20% భారీ డిస్కౌంట్

తెలంగాణ ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల (EV) వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఒక వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించింది

By -  Knakam Karthik
Published on : 24 March 2026 5:07 PM IST

Telangana EV Policy, Govt Employees, Electric Vehicles, EV Discounts

తెలంగాణ సర్కార్ బంపర్ ఆఫర్..ప్రభుత్వ ఉద్యోగులకు ఈవీ వాహనాలపై 20% భారీ డిస్కౌంట్

తెలంగాణ ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల (EV) వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఒక వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద ప్రముఖ ఈవీ తయారీదారులతో (OEM) నేరుగా చర్చలు జరిపి, ప్రభుత్వ ఉద్యోగులకు వాహనాల ధరలపై 20 శాతం వరకు భారీ తగ్గింపును ఖరారు చేసింది. దీనివల్ల రాష్ట్రంలోని సుమారు 5 లక్షల మంది ఉద్యోగులు లబ్ధి పొందనుండగా, ఒక్కో కుటుంబానికి గరిష్ఠంగా రూ. 4 లక్షల వరకు ఆదా అయ్యే అవకాశం ఉంది.

దేశంలోనే మొదటిసారిగా ప్రభుత్వ సబ్సిడీ భారం లేకుండా, కేవలం తయారీ సంస్థలతో చర్చల ద్వారా ఈ తరహా రాయితీ మోడల్‌ను తీసుకురావడం విశేషం. ఇప్పటికే మహీంద్రా ఎలక్ట్రిక్, ఓలా, గ్రావ్టన్ మోటార్స్, అథర్ ఎనర్జీ వంటి సంస్థలతో ఒప్పందాలు కుదిరాయి. టాటా ఈవీ వంటి మరిన్ని కంపెనీలతో చర్చలు కొనసాగుతున్నాయి.

ఈ రాయితీలతో పాటు ఇప్పటికే అమల్లో ఉన్న ఈవీ విధానం ప్రకారం రోడ్డు పన్ను, రిజిస్ట్రేషన్ ఫీజుల నుండి 100 శాతం మినహాయింపు లభిస్తుంది. ఇది ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనాలతో పాటు టాక్సీలు, ఆటోలు మరియు బస్సులకు కూడా వర్తిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులను ఈవీల వైపు మళ్లించడం ద్వారా సమాజంలో మార్పు తీసుకురావాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.

మరోవైపు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు అన్ని ప్రభుత్వ శాఖలు ఇకపై కొత్తగా కేవలం ఎలక్ట్రిక్ వాహనాలనే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. పట్టణ ప్రాంతాల్లో అద్దెకు తీసుకునే వాహనాలు కూడా విద్యుత్ వాహనాలే అయి ఉండాలని ప్రభుత్వం నిబంధన విధించింది. ప్రస్తుతం రాష్ట్ర రవాణా వ్యవస్థలో ఇప్పటికే 2,800కు పైగా ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయి.

Next Story