తెలంగాణలో ఎలక్షన్ కోడ్.. ఏం చేయకూడదు? ఏం చేయొచ్చు?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వానికి, పోటీ చేసే అభ్యర్థులకు, పార్టీలకు ఈ కోడ్‌ వర్తిస్తుంది.

By అంజి  Published on  10 Oct 2023 11:11 AM IST
Telangana elections, election code, ECI, Assembly elections

తెలంగాణలో ఎలక్షన్ కోడ్.. ఏం చేయకూడదు? ఏం చేయొచ్చు? 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదలైంది. దీంతో రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వానికి, పోటీ చేసే అభ్యర్థులకు, పార్టీలకు ఈ కోడ్‌ వర్తిస్తుంది.

ఎలక్షన్‌ కోడ్‌ అమల్లోకి వచ్చిన తర్వాత.. ఎలక్షన్ షెడ్యూల్ ప్రకటించడానికి ముందే ప్రారంభమైన స్కీమ్‌లు, ఈవెంట్‌లు కొనసాగించుకోవచ్చు. వరదలు, కరవు, మహమ్మారి ప్రబలినప్పుడు, ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ప్రభావిత ప్రాంతాలలో సహాయ, పునరావాస కార్యక్రమాలు చేపట్టొచ్చు. తీవ్ర అనారోగ్యంతో బాధపడేవారికి మెడికల్‌ ట్రీట్మెంట్‌ కానీ, వైద్యం కోసం నగదు సాయం కానీ తగిన అనుమతులు తీసుకుని చేయొచ్చు. ఎన్నికల సభలు పెట్టడానికి గ్రౌండ్‌లు వంటి బహిరంగ స్థలాలను అన్ని పార్టీలకు, ఇతర అభ్యర్థులకు కూడా అందుబాటులో ఉండేలా నిష్పాక్షికంగా వ్యవహరించాలి. ఇతర పార్టీల విధానాలు, పథకాలు, వారు చేసే కార్యక్రమాలను విమర్శించ వచ్చు.

అధికారంలో ఉన్న తమ సర్కార్‌ సాధించిన విజయాలు, తమ పార్టీ సాధించిన విజయాలు అంటూ ప్రభుత్వ డబ్బులతో ప్రకటనలు ఇవ్వడానికి వీల్లేదు. ఓటరుగా, అభ్యర్థిగా, ఏజెంట్‌గా తప్ప మంత్రులెవరూ పోలింగ్ కేంద్రాల్లోకి, కౌంటింగ్‌ కేంద్రాల్లోకి వెళ్లడానికి అనుమతి లేదు. ఓట్లు అడగడం కోసం ఓటర్లు కులం, మతాలను వాడుకోవడం వంటివి చేయరాదు. ఇతర పార్టీల నేతలు, అభ్యర్థుల వ్యక్తిగత జీవితాలపై విమర్శలు చేయరాదు. తమ అభిప్రాయాలు, తమ విధానాలతో ఏకీభవించని వారి ఇళ్ల ముందు నిరసనలు చేయడానికి వీల్లేదు. అధికార లేక ప్రైవేట్‌ సెక్యూరిటీ ఉన్నవారిని ఎలక్షన్‌ ఎజెంటుగా, పోలింగ్‌ ఎజెంట్‌గా, కౌంటింగ్‌ ఏజెంట్‌గా నియమించరాదు.

అన్ని రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, పార్టీ కార్యకర్తలు, నాయకులకు వర్తించేలా ఎలక్షన్ కమిషన్ కొన్ని సూచనలు చేస్తుంది. కులాలు, మతాల మధ్య, వేర్వేరు భాషలు మాట్లాడే ప్రజల మధ్య విభేధాలు, వైషమ్యాలు సృష్టించడం కానీ చేయరాదు. ఇది అభ్యర్థులు, పార్టీలు అందరికీ వర్తిస్తుంది. ఇతర పార్టీలు, నాయకులు, కార్యకర్తలపై తప్పుడు ఆరోపణలు చేయడానికి వీల్లేదు. ఓట్ల కోసం కులం, మతాలను వాడుకోవద్దు. ప్రచారం కోసం మసీదులు, చర్చిలు, ఆలయాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపయోగించుకోరాదు. ఓటర్లను బెదిరించడం లేదంటే డబ్బులు ఇవ్వడం, ఒకరి ఓటు మరొకరు వేయడం, పోలింగ్‌ సెంటర్‌కు 100 మీటర్ల పరిధిలో ప్రచారం పూర్తిగా నిషేధం.

పోలింగ్ కేంద్రానికి ఓటర్లను తరలించడం నిబంధనలకు విరుద్ధం. పోలింగ్ ముగిసే సమయానికి ముందు 48 గంటల లోపు బహిరంగ సభలు నిర్వహించడం పూర్తిగా నిషేధం. ఇతర పార్టీల, అభ్యర్థుల సమావేశాలు, ప్రచార కార్యక్రమాలను అడ్డుకోవడానికి వీల్లేదు. ఇలా చేస్తే ఆయా రాజకీయ పార్టీలు, అభ్యర్థులపై చర్యలు ఉంటాయి. ఇతర పార్టీలకు చెందిన, అభ్యర్థులకు చెందిన పోస్టర్లు, ఫ్లెక్సీలు, ఇతర ప్రచార సామగ్రిని తొలగించడానికి వీల్లేదు. అలాగే సమావేశాలు నిర్వహించాలంటే ముందుగానే స్థానిక పోలీస్ స్టేషన్‌లో సమాచారం ఇవ్వాలి. సమావేశం వివరాలను తెలియజేస్తే పోలీస్ డిపార్ట్‌మెంట్‌ అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తుంది.

ర్యాలీలు, ప్రదర్శనల సమాచారం కూడా ముందుగానే పోలీసులకు ఇవ్వాల్సి ఉంటుంది. ర్యాలీ నిర్వహించే సమయంలో మార్గం మార్చడం వంటివి చేయొద్దు. ర్యాలీ సాగే మార్గంలో అప్పటికే ఏవైనా నిషేధాజ్ఞలు ఉంటే నిర్వాహకులు దాన్ని పాటించాల్సి ఉంటుంది. ఒకే ప్రాంతంలో, ఒకే సమయంలో వేర్వేరు పార్టీలు కానీ వేర్వేరు అభ్యర్థులు కానీ ర్యాలీలు నిర్వహించాలనుకుంటే రెండు కలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇతర పార్టీల నాయకులు, అభ్యర్థులను పోలిన దిష్టిబొమ్మలను తీసుకెళ్లడం, అలాంటివి తగలబెట్టడం నిషేధం.

Next Story