తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు 36వేల EVMలు సిద్ధం: వికాస్‌ రాజ్

తెలంగాణలో శాసనసభ ఎన్నికల కోసం 36వేల ఈవీఎంలను ఇప్పటికే సిద్ధం చేసినట్లు వికాస్‌ రాజ్‌ వెల్లడించారు.

By Srikanth Gundamalla  Published on  23 Nov 2023 11:45 AM GMT
telangana, election officer, vikas raj,  polling,

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు 36వేల EVMలు సిద్ధం: వికాస్‌ రాజ్

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల కోసం ఏర్పాట్లను చకా చకా పూర్తి చేస్తున్నట్లు చెప్పారు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌ రాజ్‌. పోలింగ్‌కు ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అలాగే.. ఏ పోలింగ్‌ కేంద్రం వద్ద కూడా అవకతవకలు జరగకుండా ఉండేందుకు పూర్తిస్థాయిలో భద్రతను ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌ రాజ్‌ వెల్లడించారు.

తెలంగాణలో 18 నుంచి 19 ఏళ్ల వయసు ఉన్న ఓటర్లు 9.9 లక్షల మంది ఉన్నారని వికాస్‌ రాజ్ చెప్పారు. సర్వీసు ఓటర్లు ఇప్పటికే ఓటు హక్కు వినియోగించుకుంటున్నారని చెప్పారు. తెలంగాణలో శాసనసభ ఎన్నికల కోసం 36వేల ఈవీఎంలను ఇప్పటికే సిద్ధం చేసినట్లు ఆయన వెల్లడించారు. అలాగే ఈసారి కొత్తగా 51 లక్షల ఓటర్‌ కార్డులను ప్రింట్‌ చేశామనీ.. వాటిని తపాలాశాఖ ద్వారా పంపిణీ చేశామని తెలిపారు. ఇక 60 మంది వ్యయ పరిశీలకులను నియమించినట్లు చెప్పారు. రాష్ట్రంలో ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు 377 కంపెనీల కేంద్ర బలగాలన తీసుకొస్తున్నట్లు చెప్పారు వికాస్‌ రాజ్. అలాగే ఆ తర్వాత ఫలితాల రోజు ప్రతి కౌంటింగ్‌ సెంటర్‌కు ఒక అబ్జర్వర్‌ ఉంటారని ఆయన చెప్పారు.

తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికే 86 శాతం ఓటరు స్లిప్పుల పంపిణీ పూర్తయిందని వికాస్‌ రాజ్ తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 35,635 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఆరు నియోజకవర్గాల్లో ఐదు వేలకు పైగా పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయని అన్నారు. పోలింగ్‌ సిబ్బందికి పోలింగ్‌ కేంద్రంలోనే అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామని వికాస్‌ రాజ్ అన్నారు. అలాగే రాష్ట్రంలో మొదటిసారిగా హోం ఓటింగ్ చేస్తున్నామని అన్నారు. 80 ఏళ్లు పౌఐబడిన వారు, దివ్యాంగులు, అత్యవసర సేవల్లో ఉన్నవారు ఈ సదుపాయం ఉపయోగించుకోవచ్చని వికాస్‌రాజ్‌ తెలిపారు. ఈ ఎన్నికల్లో ఓటర్లకు ఒక బుక్‌లెట్‌ ఇస్తున్నామని.. దానిపై బ్యాలెట్‌ సెట్‌ను ఎలా వాడాలో వివరించి ఉంటుందని చెప్పారు. ఓటర్ ఇన్‌ఫర్మేషన్ స్లిప్స్‌ కూడా మరో రెండ్రోజుల్లో పూర్తవుతుందని ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌ రాజ్ తెలిపారు.

Next Story