Telangana: కౌంటింగ్ కేంద్రాల వద్ద బందోబస్తుపై డీజీపీ ఆదేశాలు
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌కు మరిన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది.
By Srikanth Gundamalla Published on 2 Dec 2023 12:33 PM ISTTelangana: కౌంటింగ్ కేంద్రాల వద్ద బందోబస్తుపై డీజీపీ ఆదేశాలు
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌కు మరిన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. కౌంటింగ్ కోసం ఇప్పటికే ఎన్నికల సంఘం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించారు. మరోవైపు స్ట్రాంగ్ కౌంటర్ల వద్ద ఈవీఎంలను భద్రపరిచి.. పట్టిష్ట బందోబస్తును ఉంచారు. అయితే.. ఆదివారం ఉదయ 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. లెక్కింపు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగొద్దని తెలంగాణ డీజీపీ అంజనీకుమార్ ఆదేశించారు. ఈ క్రమంలో సీపీలు, ఎస్పీలతో ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద బందోబస్తుపై పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడిన డీజీపీ అంజనీకుమార్.. ఓట్ల లెక్కింపు కేంద్రాల బయట పటిష్ట నిఘా పెట్టాలని చెప్పారు. కేంద్రాల లోపల కూడా దృష్టి సారించాలని ఆదేశించారు. ఇక ముఖ్యంగా చివరి రౌండ్లలో ఉత్కంఠగా ఉండే అవకాశం కొనసాగితే.. ఆ సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. ఏ సమయంలో అయినా ఉద్రిక్తలకు దారి తీసే అవకాశాలు ఉండొచ్చని.. అలాంటివేవి జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద గుంపులుగా ఎవరినీ ఉండనివ్వొద్దని చెప్పారు. పికెటింగ్ చేయడంతో పాటు అదనపు బలగాలను కూడా సిద్ధంగా ఉంచుకోవాలని డీజీపీ అంజనీకుమార్ సూచించారు.
అయితే.. గెలుపొందిన అభ్యర్థులు విజయోత్సవ ర్యాలీలు నిర్వహించుకుంటారు.. అవి ప్రశాంతంగా జరిగేలా చూడాలన్నారు అంజనీకుమార్. ప్రతీకార దాడులు జరగకుండా అందరిపై ఒక కన్నువేసి ఉంచాలని చెప్పారు. పోటీలో ఉన్న ప్రధాన పార్టీ అభ్యర్థులతో పోలీసు అధికారులు సమన్వయం చేసుకోవాలని డీజీపీ చెప్పారు. ఎవరు గెలుపొందినా పోలీసులకు సహకరించేలా ఉండాలని ముందుగానే వారితో చెప్పాలన్నారు. పోలింగ్ ఎలాగైతే ప్రశాంతంగా జరిగిందో.. కౌంటింగ్ కూడా అలాగే ప్రశాంతంగా కొనసాగేలా చూడాలన్నారు. శనివారం, ఆదివారం ఈ రెండ్రోజులు అప్రమత్తంగా ఉండాలని పోలీసు అధికారులకు డీజీపీ అంజనీకుమార్ సూచించారు.