గతంతో పోలిస్తే ఈసారి పోలింగ్ శాతం బాగానే ఉంది: వికాస్ రాజ్
తెలంగాణలో 17 లోక్‌సభ నియోజకవర్గాలకు ఒకేసారి పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 13 May 2024 4:19 PM ISTగతంతో పోలిస్తే ఈసారి పోలింగ్ శాతం బాగానే ఉంది: వికాస్ రాజ్
నాలుగో విడతలో భాగంగా తెలంగాణలో 17 లోక్‌సభ నియోజకవర్గాలకు ఒకేసారి పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో ప్రశాంతంగా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. పటిష్ట బందోబస్తు మధ్య పోలింగ్‌ను నిర్వహిస్తున్నారు అధికారులు. సోమవారం ఉదయమే రాష్ట్రంలో ఉన్న ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే.. రాష్ట్రంలో పోలింగ్ జరుగుతోన్న తీరుపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్ స్పందించారు. ఈ మేరకు మీడియా సమావేశంలో మాట్లాడారు.
గత ఎన్నికలతో పోలిస్తే తెలంగాణలో ఈసారి పోలింగ్ శాతం బాగానే ఉందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ అన్నారు. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం 50 దాటిందని పేర్కొన్నారు. కానీ.. ఎప్పటిలానే హైదరాబాద్‌లో ఉన్న ఓటర్లు మాత్రం ఓటింగ్‌కు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపడం లేదన్నారు. హైదరాబాద్ పరిధిలో ఇప్పటి వరకు 20 శాతం పోలింగ్ నమోదు అయ్యిందని సీఈవో వికాస్ రాజ్ తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోందని వికాస్ రాజ్ అన్నారు. అలాగే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై వచ్చిన ఫిర్యాదులపై విచారణ జరుగుతోందని ఈసందర్భంగా సీఈవో వికాస్ రాజ్ చెప్పారు.
రాష్ట్రంలో ఉన్న 17 లోక్‌సభ నియోజకవర్గాలకు ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభం అయ్యింది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. అయితే.. సాయంత్రం మరింత ఎక్కువగా పోలింగ్ శాతం నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. గత 2019 ఎన్నికలతో పోలిస్తే ఈ సారి పోలింగ్ పర్సంటేజ్ ఎక్కువగానే నమోదు అయ్యే చాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు.