బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి, కుటుంబ సభ్యుల ఇళ్లలో ఈడీ సోదాలు

తెలంగాణలో ఈడీ అధికారులు మరోసారి సోదాలు నిర్వహిస్తున్నారు.

By Srikanth Gundamalla  Published on  20 Jun 2024 5:15 AM GMT
Telangana, ed raid,  mla mahipal reddy, house,

బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి, కుటుంబ సభ్యుల ఇళ్లలో ఈడీ సోదాలు

తెలంగాణలో ఈడీ అధికారులు మరోసారి సోదాలు నిర్వహిస్తున్నారు. రాజకీయ నాయకుల ఇళ్లలో తనిఖీలు కొనసాగడం కలకలం రేపుతోంది. ఈడీ సోదాల వ్యవహారం మరోసారి చర్చనీయాంశం అయ్యింది. పటాన్‌చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. అదే సమయంలో ఆయన సోదరుల ఇళ్లలో కూడా సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. గురువారం తెల్లవారు జాము నుంచే ఈడీ అధికారులు తనిఖీలను ప్రారంభించారు.

ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డి నివాసంలో తనిఖీలు చేశారు. ఈడీ సోదాల అంశం పటాన్‌చెరులో సంచలనంగా మారింది. మహిపాల్‌రెడ్డి సోదరులు ఇద్దరు మైనింగ్, రియల్‌ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నారు. మరోవైపు ఇటీవలే గూడెం మధును పోలీసులు ఓ కేసులో అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. నిజాంపేటలోని ఎమ్మెల్యే మహిపాల్‌ రెడ్డి ఇంట్లో కూడా ఈడీ అధికారులు తనిఖీలు చేస్తున్నట్లు తెలుస్తోంది. 8 చోట్ల సోదాలు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యేకు సంబంధించిన సంతోష్ గ్రానైట్ కంపెనీలో తనిఖీలు చేపట్టారు.గతంలో లక్డారం గనుల వ్యవహారంలో పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. ఈ కేసు ఆధారంగానే ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నట్లు సమాచారం. తాజాగా సోదాల గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Next Story