Telangana: డీఎస్సీపై వేల అభ్యంతరాలు, నెలాఖరులోనే ఫలితాలు!
తెలంగాణలో ఇటీవలే డీఎస్సీ పరీక్షలు పూర్తయ్యాయి.
By Srikanth Gundamalla Published on 21 Aug 2024 7:12 AM ISTTelangana: డీఎస్సీపై వేల అభ్యంతరాలు, నెలాఖరులోనే ఫలితాలు!
తెలంగాణలో ఇటీవలే డీఎస్సీ పరీక్షలు పూర్తయ్యాయి. అయితే.. ప్రాథమిక ‘కీ’పై అభ్యంతరాలు తెలిపేందుకు అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు డీఎస్సీ పరీక్షలపై 28వేలకు పైగా అభ్యంతరాలు వచ్చాయని అధికారులు చెప్పారు. డీఎస్సీ పరీక్షల్లో భాగంగా ఒక రోజు వచ్చిన ప్రశ్నలే మరో రోజు రావడం.. 19 ప్రశ్నలు పునరావృతం కావడంపై సర్కారు ఆరా తీసింది. ప్రశ్నలు పునరావృతం కావడంపై పాఠశాల విద్యాశాఖ పరిశీలిస్తున్నది. ఈ తప్పిదం ఎలా జరిగింది అని, ఇందుకు బాధ్యులెవరు? అన్న కోణంలో విచారణ జరుపుతోంది. ఈ విచారణ అనంతరం బాధ్యులైన వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలిసింది. ఇక దాదాపు 28,500 అభ్యంతరాలు వచ్చినట్టు విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి.
అయితే.. జూలై 18 నుంచి ఆగస్టు 13 వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహించారు. ప్రాథమిక కీలను ఈ నెల 13న విద్యాశాఖ విడుదల చేసింది. దీనిపై అభ్యంతరాలు తెలిపేందుకు ఈ నెల 20 వరకు గడువును ఇచ్చారు. ఈ గడువు మంగళవారం సాయంత్రంతో ముగిసింది. ఈ నెలాఖరులో ఫైనల్‌కీని విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఈసారి డీఎస్సీ పరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహించామని పాఠశాల, విద్యాశాఖ డైరెక్టర్ ఈవీ నర్సింహారెడ్డి చెప్పారు. ఎక్కడా పేపర్ లీక్ అన్న ప్రశ్న ఉత్పన్నం కాలేదని వెల్లడించారు. ఎస్జీటీ పరీక్షలో 160 ప్రశ్నలకు ఒక్కో ప్రశ్నాపత్రంలో 8 వేర్వేరు విభాగాలు ఉంటాయనీ.. మొత్తం 7 సెషన్లకు 14 సెట్ల ప్రశ్నపత్రాలను తయారు చేశామని ఆయన అన్నారు. జూలై 19న మొదటి సెషన్ ప్రశ్నపత్రంలోని సోషల్ స్టడీస్ సబ్జెక్టుకు సంబంధించిన 18 ప్రశ్నలు.. 23న రెండో సెషన్‌లోనూ పునరావృతమయ్యాయని అంగీకరించారు. 19న ఆరు జిల్లాలు, 23న మరో 6 జిల్లాల వారికి పరీక్షలు నిర్వహించామని, ఒక సెషన్‌లో ఒక జిల్లా వారికి మాత్రమే పరీక్షలను నిర్వహించడం వల్ల, ఇది ఏ విధంగానూ అభ్యర్థుల ర్యాంకులను, ఫలితాలను ప్రభావితం చేయదని తెలిపారు. అందుకే డీఎస్సీ అభ్యర్థులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నర్సింహారెడ్డి ప్రకటనలో తెలిపారు.