డీఎస్సీ పరీక్షల షెడ్యూల్ ఎక్కడ? అభ్యర్థుల్లో టెన్షన్
డీఎస్సీ పరీక్షల నిర్వహణలో స్పష్టత ఇవ్వడం లేదు. పేపర్ల వారీగా పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించాల్సి ఉంది.
By Srikanth Gundamalla Published on 25 Jun 2024 8:15 AM ISTడీఎస్సీ పరీక్షల షెడ్యూల్ ఎక్కడ? అభ్యర్థుల్లో టెన్షన్
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మెగా డీఎస్సీ అంటూ రాష్ట్ర ప్రభుత్వం హడావుడి చేసింది. అయితే.. ఇప్పుడు పరీక్షల నిర్వహణలో స్పష్టత ఇవ్వడం లేదు. పేపర్ల వారీగా పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించాల్సి ఉంది. కానీ.. ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన రాలేదు. దాంతో.. మెగా డీఎస్పీకి అప్లై చేసుకున్న అభ్యర్థులు టెన్షన్ పడుతున్నారు. ఎప్పుడు ఏ పరీక్షను నిర్వహరిస్తారో ఏ పేపర్‌కు ఎంత సమయం పాటు ప్రిపేర్ కావాలో తెలియక ఆందోళన చెందుతున్నారు.
కాగా.. జూలై 17 నుంచి 31 వరకు డీఎస్సీ రాత పరీక్షలను నిర్వహిస్తామని విద్యాశాఖ ప్రకటించింది. తొలిసారిగా డీఎస్సీ పరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహించనుండగా, ఉమ్మడి పది జిల్లాల్లోనే సెంటర్లను కేటాయించనున్నారు. పలువురు అభ్యర్థులు సెకండరీ గ్రేడ్ టీచర్‌తో పాటు, పలు సబ్జెక్టుల్లో స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షలకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేయాలని డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం నేతలు డిమాండ్ చేస్తున్నారు. అలా చేస్తేనే అభ్యర్థులు ప్రిపేర్ అవ్వడానికి వెసులు బాటు ఉంటుందని చెబుతున్నారు.
పాఠశాల విద్యాశాఖ డీఎస్సీ 11,062 టీచర్ పోస్టుల భర్తీకి -2024 నోటిఫికేషన్‌ను జనవరిలో విడుదల చేసింది. వీటిలో 2,629 స్కూల్ అసిస్టెంట్, 6,508 సెకండరీ గ్రేడ్ టీచర్లు, 727 భాషాపండితులు, 182 పీఈటీ పోస్టులున్నాయి. స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 220 ఉండగా, సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు 796 భర్తీ చేస్తున్నారు. 11,062 పోస్టులకు గాను డీఎస్సీకి ఈ ఏడాది 2,79,956 మంది దరఖాస్తు చేసుకున్నారు. స్కూల్ అసిస్టెంట్ పోస్టులు తక్కువగా ఉండగా, ఈ పోస్టుకే అత్యధికంగా దరఖాస్తు చేసుకోవడంతో పోటీ ఎక్కువైంది. 2వేలకు పైగా స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు 1,61,746 మంది దరఖాస్తు చేసుకున్నారు. 6వేలకు పైగా గల ఎస్జీటీ పోస్టులకు 88,007వేల మంది దరఖాస్తు చేసుకున్నారు.