Telangana: విద్యుత్‌ టారిఫ్‌లను ప్రతిపాదించిన డిస్కమ్‌లు.. ఫిక్స్‌డ్‌ చార్జీలపెంపు!

హైదరాబాద్: రాష్ట్రంలో విద్యుత్ చార్జీలను సవరించాలని రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కమ్‌లు) ప్రతిపాదించాయి.

By అంజి  Published on  19 Sep 2024 4:43 AM GMT
Telangana Discoms, power tariffs, TGERC, public hearings

Telangana: విద్యుత్‌ టారిఫ్‌లను ప్రతిపాదించిన డిస్కమ్‌లు.. ఫిక్స్‌డ్‌ చార్జీలపెంపు!

హైదరాబాద్: రాష్ట్రంలో విద్యుత్ చార్జీలను సవరించాలని రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కమ్‌లు) ప్రతిపాదించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2024-25) వార్షిక ఆదాయ అవసరాల నివేదిక (ARR) బుధవారం అర్థరాత్రి తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ కమిషన్ (TGERC)కి సమర్పించబడింది. మూడు కేటగిరీల్లో చార్జీలను సవరించాలని డిస్కమ్‌లు ప్రతిపాదించాయి. సిఫార్సులను రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (ఈఆర్‌సీ) ఆమోదించినట్లయితే.. లోటును భర్తీ చేసేందుకు రూ.1200 కోట్ల ఆదాయం వస్తుందని డిస్కమ్‌లు అంచనా వేస్తున్నాయి.

రాష్ట్రంలో కనీసం మూడు చోట్ల ప్రజల సమక్షంలో ఈ ప్రతిపాదనలపై పబ్లిక్ హియరింగ్‌లు నిర్వహించిన తర్వాత ఈఆర్‌సీ తుది తీర్పును ఇస్తుంది. ఆ తర్వాత చార్జీల సవరణ అమలులోకి వస్తుంది. ఈ మొత్తం ప్రక్రియకు 90 రోజులు పడుతుంది. సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ (TGSPDCL), నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ (TGNPDCL) ఈ ఏడాది తమ ఆదాయ వ్యయాల మధ్య రూ.14,222 కోట్ల లోటును అంచనా వేసింది. ఈ మొత్తంలో రూ. 13,022 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ద్వారా అందించాలని కోరింది. మిగిలిన రూ.1200 కొరతను భర్తీ చేసేందుకు ఛార్జీల సవరణకు ప్రతిపాదనలు ఇస్తున్నట్లు ఈ రెండు సంస్థలు తెలిపాయి.

ప్రస్తుతం గృహాలు వినియోగించే విద్యుత్ నెలకు 300 యూనిట్లు దాటితే కిలోవాట్‌కు రూ.10 ఫిక్స్‌డ్ చార్జీగా వసూలు చేస్తున్నారు. దీనిని రూ.50కి పెంచేందుకు అనుమతించాలని డిస్కమ్ లు కోరాయి. ప్రభుత్వం గృహజ్యోతి పథకం కింద నెలకు 200 యూనిట్లలోపు వినియోగించే గృహాలకు ఉచిత విద్యుత్‌ను అందజేస్తోంది. అలాగే 299 యూనిట్ల వరకు ఉన్న ఇళ్లకు లైన్ చార్జీ పెంపు ఉండదు.

డిస్కమ్‌ల ప్రకారం రాష్ట్రంలో 1.30 కోట్లకు పైగా ఇళ్లకు విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వారిలో 80 శాతానికి పైగా 300 యూనిట్ల కంటే తక్కువ వాడుతున్నందున, ఫిక్స్‌డ్ చార్జీల పెంపు చాలా మందికి భారం కాదని డిస్కమ్‌లు తెలిపాయి. కొత్త ప్రతిపాదనలు అమల్లోకి వస్తే నెల విద్యుత్‌ వినియోగం 300 యూనిట్లకు మించిన వారికి ఫిక్స్‌డ్‌ చార్జీలు రూ.150కి పెరగనున్నాయి. ఎల్టీ కేటగిరీకి ఫిక్స్‌డ్‌ చార్జీలు మాత్రమే పెరగనుండగా, హైటెన్షన్‌ (హెచ్‌టీ) కేటగిరీ వినియోగదారులకు మాత్రం విద్యుత్‌ బిల్లులు షాక్‌ ఇవ్వబోతున్నాయి. హెచ్‌టీ కేటగిరీలో ఇటు విద్యుత్‌ చార్జీలు, అటు ఫిక్స్‌డ్‌ చార్జీలు రెండూ పెరగబోతున్నాయి.

Next Story