ధరణిలో పెండింగ్ సమస్యలపై నేటి నుంచే స్పెషల్ డ్రైవ్
ధరణి పోర్టల్‌లో చాలా పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
By Srikanth Gundamalla Published on 1 March 2024 6:50 AM ISTధరణిలో పెండింగ్ సమస్యలపై నేటి నుంచే స్పెషల్ డ్రైవ్
తెలంగాణలో గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌లో చాలా పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. లక్షలాది దరఖాస్తులకు పరిష్కారం చూపాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే మార్చి ఒకటో తేదీ నుంచి స్పెషల్ డ్రైవ్ ప్రారంభం అవుతుంది. ఈ కార్యక్రమం ఈ నెల 9వ తేదీ వరకు కొనసాగనుంది. ఇందుకుగాను ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
ఈ స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా సుమారు 2.45 లక్షల దరఖాస్తులను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జిల్లా కలెక్టర్లు వ్యక్తిగతంగా చొరవ చూపాలని.. ఈ ప్రక్రియను సక్సెస్ చేయాలని ప్రభుత్వం వారిని కోరింది. రాష్ట్రంలోని అన్ని తహసీల్దార్ కార్యాలయాల్లో ధరణి దరఖాస్తుల పరిష్కారానికి స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నారు. ఇందుకోసం జిల్లా కలెక్టర్లు తహసీల్దార్ కార్యాలయ స్థాయిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తారు.
తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ల నేతృత్వంలో ఏర్పాటయ్యే ఈ బృందాల్లో అందుబాటులో ఉన్న రెవెన్యూ సిబ్బందితో పాటు పారాలీగల్ వాలంటీర్లు, కమ్యూనిటీ సర్వేయర్లు, వ్యవసాయ విస్తరణాధికారులు, పంచాయతీ కార్యదర్శులను కూడా నియమించాలని ప్రభుత్వం సూచించింది. దీని కోసం అవసరమైన శిక్షణ ఇవ్వాలని చెప్పింది. పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి గ్రామాల వారీగా ఈ బృందాలకు అప్పగించాలని తెలిపింది. ఇక దరఖాస్తుల పరిష్కార ప్రక్రియపై సమాచారాన్ని వీఆర్వోల ద్వారా లేదా మేసెజ్‌ల రూపంలో సదురు దరఖాస్తుదారులకు పంపాలని చెప్పింది.
ధరణిలో రికార్డుల ఆధారంగా పెండింగ్ దరఖాస్తులను, వాటితోపాటు వచ్చిన డాక్యుమెంట్లను ఈ బృందాలు పరిశీలిస్తాయి. అసైన్డ్, ఇనామ్, పీవోటీ, భూదాన్, వక్ఫ్, దేవాదాయ భూముల వివరాలను కూడా క్షుణ్నంగా తనిఖీ చేస్తాయి. అవసరమైతే క్షేత్రస్థాయిలో విచారణ జరపనున్నాయి. స్థానికంగా సదురు భూముల గురించి వివరిస్తాయి.చివరగా నివేదికను రూపొందించి ఆయా దరఖాస్తులను ఆమోదించాలా లేదా అన్నది పొందుపర్చాల్సి ఉంటుంది. వాటిని తహసీల్దార్లు పైస్థాయి అధికారులకు పంపుతారు. వారు వాటిని పరిశీలించి ఆమోదానికి, లేదా తిరస్కారానికి కారణాలను చెప్తూ ఉత్తర్వులు ఇస్తారు.