గృహజ్యోతి పథకంపై డిప్యూటీ సీఎం భట్టి పూర్తి క్లారిటీ
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గృహజ్యోతి పథకంపై పూర్తి స్పష్టతను ఇచ్చారు.
By Srikanth Gundamalla Published on 10 March 2024 6:26 AM ISTగృహజ్యోతి పథకంపై డిప్యూటీ సీఎం భట్టి పూర్తి క్లారిటీ
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీ అమలుపై ప్రత్యేక దృష్టి పెట్టిన విషయం తెలిసిందే. ఎన్నికల సమయంలో కూడా ఈ ఆరు గ్యారెంటీలకు ప్రజలు ఆకర్షితులు కావడంతోనే అదికారం కట్టబెట్టారనే వార్తలు వినిపించాయి. ఇక ఇప్పుడు వాటి అమలులో పూర్తిగా నిమగ్నమైపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పటికే నాలుగు గ్యారెంటీలను అందిస్తోంది. ఇటీవల గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత కరెంటును అందిస్తోంది. ఇప్పటికే అమలు అవుతోన్న ప్రజల్లో ఈ పథకంపై కొంత గందరగోళం ఉంది. ఈ క్రమంలోనే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గృహజ్యోతి పథకంపై పూర్తి స్పష్టతను ఇచ్చారు.
ఈ మేరకు మీడియాతో మాట్లాడిన తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. ఒక రేషన్‌కార్డుపై ఒక్కరికే గృహజ్యోతి పథకం వర్తిస్తుందని చెప్పారు. 200 యూనిట్లలోపు విద్యుత్‌ను వాడుకున్న వారికే ఈ పథకం వర్తిస్తుందని చెప్పారు. 200 యూనిట్ల కంటే ఒక్క యూనిట్ ఎక్కువ వాడినా కూడా ఈ పథానికి అర్హులు కాబోరని స్పష్టం చేశారు. 200 యూనిట్ల కంటే ఎక్కువ విద్యుత్ వాడిన వారు కచ్చితంగా కరెంటు బిల్లులు కట్టాల్సి ఉంటుందన్నారు. ఒకవేళ ఇంతకన్నా తక్కువ యూనిట్లు వాడినా కరెంటు బిల్లువస్తే వారు బిల్లులు కట్టొద్దని చెప్పారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రేషన్ కార్డు, సర్వీస్ నెంబర్, ఆధార్‌కార్డును ప్రజాపాలన అధికారికి అప్పగిస్తే ఆటోమెటిక్‌గా జీరో బిల్లు వస్తుందని చెప్పారు. అయితే.. గృహజ్యోతి పథకం కింద రాష్ట్రంలో 40,33,702 మందికి జీరో బిల్లులు ఇచ్చినట్లు తెలిపారు.
ఇక రైతుభరోసా గురించి మాట్లాడిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. రాళ్లు, రప్పలు, కొండలు, గుట్టలున్న భూముల సమాచారం తమ వద్దలేదని చెప్పారు. ఈసారి వాటికి కూడా రైతుభరోసా నిధులు జమచేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు మూడెకరాలు ఉన్నవారికి రైతుభరోసా నిధులు ఇచ్చామనీ అన్నారు. ప్రస్తుతం నాలుగు ఎకరాలు ఉన్నవారికి డబ్బులు ఇస్తున్నామనీ.. త్వరలోనే ఐదెకరాలు ఉన్నవారికి నిధుల పంపిణీ చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. ఇక త్వరలోనే మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పబోతుందని అన్నారు. ఈ నెల 12న వడ్డీలేని రుణ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.