Telangana: త్వరలోనే కొత్త పెన్షన్లు: డిప్యూటీ సీఎం భట్టి

ప్రజావాణి ఫిర్యాదులపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమావేశం నిర్వహించారు.

By Srikanth Gundamalla  Published on  5 Aug 2024 7:30 AM IST
Telangana, deputy cm Bhatti,  new pensions,

Telangana: త్వరలోనే కొత్త పెన్షన్లు: డిప్యూటీ సీఎం భట్టి 

ప్రజావాణి ఫిర్యాదులపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై చర్చించారు. చౌక దుకాణాల్లో రేషన్ తీసుకునేందుకు, సంక్షేమ పథకాలను పొందేందుకు వేర్వేరుగా గుర్తింపు కార్డులు ఇవ్వాలనే అంశంపై ప్రభుత్వం చర్చిస్తోందని చెప్పారు. త్వరలోనే దీనిపై నిర్ణయం కూడా ఉంటుందని అన్నారు. అలాగే.. ప్రజావాణికి కొత్త రేషన్ కార్డులు, పెన్షన్లు, ధరణికి సంబంధించిన ఫిర్యాదులు పెద్ద సంఖ్యలో వస్తున్నాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. రేషన్‌ కార్డులకు సంబంధించి ప్రభుత్వం కేబినెట్‌ సబ్‌ కమిటీని ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. కొత్త పెన్షన్లను కూడా రాష్ట్రంలో త్వరలోనే అమలు చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. అన్ని ఆస్పత్రుల్లో ఆరోగ్య శ్రీ డెస్క్‌లను బలోపేతం చేసేలా చర్యలు తీసుకోవాలనీ.. అలా చేయడం ద్వారా ఫిర్యాదులు తగ్గిపోతాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అభిప్రాయపడ్డారు.

వచ్చే మార్చి నాటికి ఎట్టి పరిస్థితుల్లో యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌ నుంచి పూర్తిస్థాయిలో విద్యుత్‌ ఉత్పత్తి జరిగి తీరాలని జెన్‌కో అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పలు ఆదేశాలు జారీ చేశారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. యాదాద్రి నాలుగు యూనిట్లను దశల వారీగా వచ్చే మార్చి నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. మరోవైపు అందుబాటులో ఉన్న స్థలాల్లో 20 సమీకృత గురుకుల సముదాయాలను నిర్మించాలని అధికారులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. విద్యాశాఖ అధికారులతోనూ ఆయన భేటీ నిర్వహించారు. విద్యాశాఖ, ఆర్‌అండ్‌బీ, ప్రైవేటు నిర్మాణ సంస్థ ప్రతినిధులతో గురుకులాల నిర్మాణాలపై సమీక్ష నిర్వహించారు. తొలిదశ నిర్మాణా లు వచ్చే ఏడాది జూన్‌ కల్లా పూర్తి చేయాలని భట్టి విక్రమార్క ఆదేశించారు.

Next Story