'ఆ మందులు వాడేముందు డాక్టర్ సలహా ముఖ్యం'.. ప్రజలకు తెలంగాణ డీసీఏ హెచ్చరిక జారీ
తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (DCA) బరువు తగ్గడానికి, టైప్-2 డయాబెటిస్ చికిత్సకు ఉపయోగించే 'సెమాగ్లుటైడ్' (Semaglutide) ఔషధంపై కీలక...
By - అంజి |
'ఆ మందులు వాడేముందు డాక్టర్ సలహా ముఖ్యం'.. ప్రజలకు తెలంగాణ డీసీఏ హెచ్చరిక జారీ
తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (DCA) బరువు తగ్గడానికి, టైప్-2 డయాబెటిస్ చికిత్సకు ఉపయోగించే 'సెమాగ్లుటైడ్' (Semaglutide) ఔషధంపై కీలక హెచ్చరికలు జారీ చేసింది. మార్చి నెలలో ఈ మందు యొక్క పేటెంట్ గడువు ముగియడంతో, మార్కెట్లోకి సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్, జైడస్, గ్లెన్‌మార్క్ వంటి కంపెనీలు దీని జనరిక్ వెర్షన్లను విడుదల చేశాయి. దీంతో బరువు తగ్గాలనుకునే వారు, మధుమేహ వ్యాధిగ్రస్తుల నుంచి ఈ మందుకి గిరాకీ ఒక్కసారిగా పెరిగింది. అయితే, రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ పర్యవేక్షణ లేకుండా ఈ ఔషధాన్ని వాడటం ప్రాణాపాయమని డీసీఏ ప్రజలను హెచ్చరించింది. సెమాగ్లుటైడ్ అనేది కేవలం డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ద్వారా మాత్రమే విక్రయించాల్సిన 'షెడ్యూల్డ్ డ్రగ్' అని స్పష్టం చేసింది.
#Hyderabad:#PublicHealth Advisory – Telangana (DCA)With multiple #Semaglutide products entering the #market after #patentexpiry, the #DrugsControlAdministration, Telangana issues a caution:• Use only with a #doctor’s prescription & #supervision.• Avoid self-medication… pic.twitter.com/EyWu5ZsDHb
— NewsMeter (@NewsMeter_In) March 24, 2026
పర్యవేక్షణ లేకపోతే తీవ్ర ఆరోగ్య సమస్యలు
వైద్యుల సలహా లేకుండా సొంతంగా ఈ మందును వాడటం వల్ల తీవ్రమైన దుష్ప్రభావాలు కలిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ముఖ్యంగా..
తీవ్రమైన ప్యాంక్రియాటిటిస్: క్లోమ గ్రంథి వాపు.
కిడ్నీ సమస్యలు: అక్యూట్ కిడ్నీ ఇంజూరీ జరిగే ప్రమాదం.
జీర్ణకోశ వ్యాధులు: తీవ్రమైన గ్యాస్ట్రోఇంటెస్టినల్ రియాక్షన్స్.
పిత్తాశయ వ్యాధులు: గాల్ బ్లాడర్ సమస్యలు తలెత్తవచ్చు.
అర్హత కలిగిన వైద్యులు మాత్రమే రోగి యొక్క ఆరోగ్య చరిత్ర, ప్రస్తుత పరిస్థితులు మరియు రిస్క్ ఫ్యాక్టర్లను అంచనా వేసి తగిన మోతాదును నిర్ణయించాల్సి ఉంటుందని డీసీఏ వివరించింది.
ఆన్‌లైన్ కొనుగోళ్లు, నకిలీ మందులపై జాగ్రత్త
లైసెన్స్ ఉన్న మెడికల్ షాపుల నుంచి మాత్రమే ఈ మందులను కొనుగోలు చేయాలని, అనధికారిక ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల జోలికి వెళ్లవద్దని ప్రభుత్వం సూచించింది. ఆన్‌లైన్‌లో దొరికే మందులు నకిలీవి లేదా నాణ్యత లేనివి అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది. అలాగే, తయారీ కంపెనీలు ఈ మందుల గురించి తప్పుడు ప్రచారం చేయకూడదని, ప్రజలను తప్పుదోవ పట్టించేలా ప్రకటనలు ఇవ్వకూడదని ఆదేశించింది. ఎక్కడైనా ఈ మందుల అక్రమ విక్రయాలు జరిగితే వెంటనే అధికారులకు ఫిర్యాదు చేయాలని కోరింది.