మైలాన్ కంపెనీకి షాకిచ్చిన డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్

తెలంగాణ డీసీఏ మైలాన్ కంపెనీకి షాకిచ్చింది. 'అల్‌ప్రజోలం' తయారీకి మైలాన్ లేబొరేటరీస్ లిమిటెడ్ లైసెన్స్‌ను రద్దు చేస్తూ బుధవారం నాడు ఉత్తర్వులను జారీ చేసింది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  14 Feb 2024 3:09 PM IST
Telangana DCA , Mylan Laboratories, alprazolam, manufacturing licence

మైలాన్ కంపెనీకి షాకిచ్చిన డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్

తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) మైలాన్ కంపెనీకి షాకిచ్చింది. 'అల్‌ప్రజోలం' తయారీకి మైలాన్ లేబొరేటరీస్ లిమిటెడ్ లైసెన్స్‌ను రద్దు చేస్తూ బుధవారం నాడు ఉత్తర్వులను జారీ చేసింది. అల్‌ప్రజోలం తయారీ యూనిట్ సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలంలో ఉంది. కంపెనీ నుంచి 21.250 కిలోల అల్ప్రాజోలం అనే సైకోటిక్ డ్రగ్ దారి మళ్లించినట్లు గుర్తించారు. అందుకే అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

కంపెనీ తయారీ యూనిట్‌లోని ఉద్యోగులు, పని చేసే రసాయన శాస్త్రవేత్తల ద్వారా డ్రగ్ ను దారి మళ్లించారని ప్రొహిబిషన్, ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. ఈ కేంద్రంలో దాదాపు 4.850 కిలోగ్రాముల అల్ప్రాజోలం కనుగొన్నారు. దీంతో అప్రమత్తమైన డ్రగ్ కంట్రోల్ అధికారులు తదుపరి విచారణ జరిపారు. కందిపప్పులో కలిపి బయటకు తీసుకుని వచ్చినట్లు గుర్తించారు.

అల్‌ప్రజోలం అంటే?

Alprazolam అనేది యాక్టివ్ ఫార్మాస్యూటికల్ పదార్ధం. యాంగ్జైటీ డిజార్డర్లు, ప్యానిక్ డిజార్డర్లు, డిప్రెషన్‌ సంబంధిత చికిత్సకు, నిద్రలేమి చికిత్స చేయడానికి ఉపయోగించే ఒక సైకోటిక్ ఔషధం. ఆల్ప్రజోలం వ్యసనంగా మారే అవకాశం కూడా ఉంది. ఈ అలవాటు మానవ శరీరంపై చాలా ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. ఆల్ప్రజోలం దుర్వినియోగం కావడం పలు ప్రతికూల ప్రభావాలకు దారితీయవచ్చు.

షోకాజ్ నోటీసులు జారీ:

లైసెన్స్ పొందిన ప్రాంగణంలో నుండి అల్ప్రాజోలమ్‌ను అనధికారికంగా మళ్లించినందుకు అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఇలా తప్పుడు దారుల్లో డ్రగ్ బయటకు వెళుతున్నా నిరోధించడానికి తగిన చర్యలు తీసుకోకపోవడంతో మైలాన్ లేబొరేటరీస్ లిమిటెడ్‌కి షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.

లైసెన్స్ రద్దు:

ఈ ఔషధం వల్ల ప్రజలకు నష్టం వాటిల్లడంతో.. DCA తక్షణమే లైసెన్స్‌ను రద్దు చేసింది.

తయారీదారులకు సలహా:

DCA డైరెక్టర్ జనరల్ V.B.కమలాసన్ రెడ్డి మాట్లాడుతూ; "నార్కోటిక్, సైకోట్రోపిక్ ఔషధాల తయారీదారులు కఠినమైన చర్యలు తప్పనిసరిగా అమలు చేయబడాలి. ఈ డ్రగ్స్‌ దుర్వినియోగాన్ని నిరోధించాలి. వీటిని అనధికారికంగా దారి మళ్లించడం, దొంగతనం అరికట్టాలి." అని అన్నారు. ఈ ఉత్పత్తులను తయారు చేసే యూనిట్లలో ఆకస్మిక దాడులను ముమ్మరం చేస్తామని డిపార్ట్‌మెంట్ తెలిపింది. ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు కూడా తీసుకుంటామని హెచ్చరించారు.

Next Story