Video: డిజిటల్ అరెస్ట్ అంటూ కాల్స్ వస్తే.. ఇలా చేయండి
ఈ మధ్య కాలంలో డిజిటల్ అరెస్ట్ అనే మోసం.. దేశంలో ఆర్థిక నేరాలకు సంబంధించిన పెద్ద సమస్యగా మారింది.
By - అంజి |
Video: డిజిటల్ అరెస్ట్ అంటూ కాల్స్ వస్తే.. ఇలా చేయండి
ఈ మధ్య కాలంలో డిజిటల్ అరెస్ట్ అనే మోసం.. దేశంలో ఆర్థిక నేరాలకు సంబంధించిన పెద్ద సమస్యగా మారింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రజలను సైబర్ బ్యూరో అలర్ట్ చేసింది. ఈ మేరకు దేశవ్యాప్తంగా జరుగుతున్న డిజిటల్ అరెస్ట్ మోసాలపై సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఒక వీడియో విడుదల చేసింది. 'సైబర్ నేరగాళ్లు పోలీసుల చర్యల పేరుతో మిమ్మల్ని భయపెట్టే ప్రయత్నం చేయవచ్చు. కానీ అలాంటి బెదిరింపులకు భయపడకండి. వెంటనే 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయండి' అని సూచించింది. ఈ డిజిటల్ అరెస్ట్ అనేది ఉండదని ఎవరైనా వీడియో కాల్ లో పోలీస్ వేషధారణలో కనిపిస్తే వారిని నమ్మి మోసపోవద్దు అంటూ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ప్రజలకు విజ్ఞప్తి చేసింది.
సైబర్ మోసాలపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల అంతర్రాష్ట్ర ఆపరేషన్ నిర్వహించారు. దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాల్లో ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి.. 61 మందిని అరెస్ట్ చేశారు. ఒక్క ఆగస్టులోనే 338 ఫిర్యాదులు అందాయి. వాటిలో 233 కేసులు నమోదు అయ్యాయి. ట్రేడింగ్ స్కాంలు, ఇన్వెస్ట్‌మెంట్, లోన్ ఫ్రాడ్స్, ఇన్సూరెన్స్ , సోషల్ మీడియా, డిజిటల్ అరెస్ట్ పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు. తమిళనాడు (20), గుజరాత్ (18), కర్ణాటక (16), మహారాష్ట్ర (13), ఢిల్లీ (13), ఆంధ్రప్రదేశ్ (7) మందిని అరెస్ట్ చేశారు. కాగా డిజిటల్ అరెస్ట్ పేరుతో వచ్చే బెదిరింపులకు ఎవ్వరూ కూడా బలి కావద్దని పోలీసులు విజ్ఞప్తి చేశారు.
అటు తెలంగాణ ప్రజలకు పోలీసులు కీలక సూచన చేశారు. 'సోషల్ మీడియాలో అపరిచిత స్నేహాలతో జాగ్రత్త. ప్రొఫైల్ ఫొటో చూసి, తియ్యని మాటలు నమ్మి అస్సలు మోసపోవద్దు. తెలియని రిక్వెస్ట్‌లు యాక్సెప్ట్ చేయవద్దు. అపరిచితులకు ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యక్తిగత వివరాలు పంచుకోవద్దు' అని తెలుపుతూ సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశారు.