ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో వడగళ్లతో కూడిన వర్షాలు కురవడంతో భారీగా పంట నష్టం జరిగింది. దీంతో ఆరుగాలం శ్రమించి పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో అకాల వర్షాల కారణంగా జరిగిన పంట నష్టం వివరాలను మే 1వ తేదీలోగా అందజేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సోమవారం జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ముఖ్య కార్యదర్శి.. నష్టాన్ని అంచనా వేసేందుకు ప్రతి మండలానికి ప్రత్యేక అధికారులను నియమించాలని కోరారు. రాష్ట్రంలో మరికొన్ని రోజులు పిడుగులు పడే అవకాశం ఉన్నందున , కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉంచిన వరి ధాన్యం తడిసిపోకుండా తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆమె ఆదేశించారు. ఇటీవల కురిసిన వర్షాలకు జరిగిన పంట నష్టాన్ని ప్రధాన కార్యదర్శి ప్రస్తావిస్తూ.. సోమవారం నుంచి పరిహారం పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, విపత్తు నిర్వహణ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, పంచాయతీరాజ్ కమిషనర్ హనుమంతరావు పాల్గొన్నారు.