తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఎన్నికల కోడ్ ముగిశాక..

తెలంగాణలో నిరుద్యోగులకు కాంగ్రెస్‌ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ వినిపించనుందని తెలుస్తోంది.

By Srikanth Gundamalla  Published on  26 May 2024 6:25 AM IST
telangana, congress govt, balmoori venkat,

తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఎన్నికల కోడ్ ముగిశాక..

తెలంగాణలో నిరుద్యోగులకు కాంగ్రెస్‌ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ వినిపించనుందని తెలుస్తోంది. రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల కోడ్‌ ప్రస్తుతం ఉన్న విషయం తెలిసిందే. జూన్ 4వ తేదీన లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడుతాయి. ఆ తర్వాత ఎన్నికల కోడ్‌ను ఈసీ ఉపసంహరిస్తుంది. ఇక ఎన్నికల కోడ్‌ ముగిసిన వెంటనే ప్రభుత్వం నిరుద్యోగుల కోసం కీలక ప్రకటన చేయనుందని సమాచారం.

ఈ మేరకు తెలంగాణ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ కూడా పలు కీలక కామెంట్స్ చేశారు. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే జీవో 46, 317 సమస్యలకు పరిష్కారం చూపుతామని పేర్కొన్నారు. నిరుద్యోగుల ప్రతి సమస్యను కాంగ్రెస్ ప్రభుత్వం కచ్చితంగా పరిష్కరిస్తుందని చెప్పారు. నిరుద్యోగులు ఆందోళన చెందొద్దని చెప్పారు. ఇక ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిరుద్యోగులను తప్పుదోవ పట్టించేలా కామెంట్స్ చేస్తున్నారంటూ బల్మూరి వెంకట్ మండిపడ్డారు. ఆయన మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని కొట్టిపారేశారు. బీఆర్ఎస్‌ ప్రభుత్వ హయాంలో విద్యార్థులు, నిరుద్యోగులను పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు.

విద్యార్థులు, నిరుద్యోగులకు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అన్నింటిని నెరవేరుస్తుందని బల్మూరి వెంకట్‌ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే జీవో 46 అంశంపై కేబినెట్ సబ్‌ కమిటీని ఏర్పాటు చేసిందని చెప్పారు. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే జీవో 46, 317 సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఎన్నికల కోడ్‌ ముగియగానే వెంటనే జాబ్‌ క్యాలెండర్ కూడా ప్రకటిస్తామని చెప్పారు. నోటిఫికేషన్ ఇస్తే ఉద్యోగం ఇచ్చినట్లు కాదనీ.. ఉద్యోగ పత్రం ఇస్తేనే ఉద్యోగాలు ఇచ్చినట్లు అని బల్మూరి వెంకట్ అన్నారు. బీఆర్ఎస్‌ ప్రభుత్వంలో ఉద్యోగాలు అమ్ముకున్నవారిని, పేపర్ లీకేజీలకు కారణమైన వారిని కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. ఉద్యోగులందరికీ ఒకటో తేదీనే జీతాలు ఇస్తామని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ చెప్పారు.

Next Story