తెలంగాణ కాంగ్రెస్ సంక్షోభం.. ట్రబుల్ షూటర్‌గా దిగ్విజయ్ సింగ్
Telangana Congress crisis.. AICC appoints Digvijay Singh as trouble shooter. హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో తాజా పరిణామాలతో.. కాంగ్రెస్‌లో సంక్షోభానికి ట్రబుల్ షూటర్‌గా
By అంజి Published on 20 Dec 2022 9:32 AM GMTహైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో తాజా పరిణామాలతో.. కాంగ్రెస్‌లో సంక్షోభానికి ట్రబుల్ షూటర్‌గా ఆ పార్టీ సీనియర్ జాతీయ నాయకుడు దిగ్విజయ్ సింగ్‌ను అఖిల భారత కాంగ్రెస్ కమిటీ నియమించింది. దిగ్విజయ్ సింగ్ అసంతృప్త సీనియర్లతో వ్యక్తిగతంగా మాట్లాడి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ప్రియాంక గాంధీకి నివేదిక సమర్పించనున్నట్లు సమాచారం. రాష్ట్ర కాంగ్రెస్ శాఖలో ప్రస్తుతం పరిస్థితులు అస్సలు బాగోలేవనేది.. ఇక్కడ ప్రస్తావించదగ్గ విషయం.
గతంలో టీడీపీ నుంచి పార్టీ ఫిరాయించిన 13 మంది నేతలు పార్టీ పదవులకు రాజీనామాలు చేస్తున్నట్టు ఆదివారం ప్రకటించడంతో కాంగ్రెస్ తెలంగాణ శాఖలో సంక్షోభం ముదిరింది. నరేందర్ రెడ్డి, సీతక్క, విజయరామారావు, ఎర్ర శేఖర్ తదితరులు తమ రాజీనామాలను తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) వర్కింగ్ ప్రెసిడెంట్‌కు పంపుతామని చెప్పారు. ఇతర పార్టీల నుండి వచ్చిన నాయకుల నుండి పార్టీని రక్షించడానికి "తెలంగాణలో కాంగ్రెస్‌ను రక్షించండి" ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నట్లు కొంతమంది సీనియర్ నాయకులు ప్రకటించిన ఒక రోజు తర్వాత ఇది జరిగింది.
కాంగ్రెస్ సీనియర్ నాయకులకు, తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నుంచి కాంగ్రెస్‌లోకి వలస వచ్చిన వారికి మధ్య పోరు సాగుతోంది. కొన్నేళ్ల క్రితం టీడీపీ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన రాష్ట్ర అధ్య క్షుడు ఏ.రేవంత్‌రెడ్డిపై బహిరంగ తిరుగుబాటుగా ఇది కనిపించింది.
ఇదిలా ఉండగా.. ఇటీవల ప్రకటించిన పార్టీ కార్యవర్గాన్ని టీడీపీ నుంచి వలస వచ్చిన వారితో ఏర్పాటు చేయడంపై అసంతృప్తితో ఉన్న సీనియర్ నేతలు చేస్తున్న ఆరోపణలకు కౌంటర్ ఇవ్వాలని రేవంత్ రెడ్డి వర్గం యోచిస్తోంది. అసంతృప్తులు చేస్తున్న ఆరోపణలు కాంగ్రెస్‌ను నిర్వీర్యం చేస్తాయని తెలుస్తోంది. మరో పరిణామంలో.. రాష్ట్ర కాంగ్రెస్‌లో జరుగుతున్న పరిణామాలను పార్టీ కేంద్ర నాయకత్వం సీరియస్‌గా తీసుకుంది. ఏఐసీసీ ఇన్ చార్జి కార్యదర్శులు అసమ్మతి నేతలతో టచ్ లో ఉన్నట్లు సమాచారం.