విభజన చట్టం ప్రకారమే కృష్ణా, గోదావరిపై ప్రాజెక్టుల అప్పగింత: సీఎం రేవంత్

హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు.

By Srikanth Gundamalla  Published on  4 Feb 2024 4:15 PM IST
telangana, cm revanth,  irrigation projects ,

విభజన చట్టం ప్రకారమే కృష్ణా, గోదావరిపై ప్రాజెక్టుల అప్పగింత: సీఎం రేవంత్

హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. బీఆర్‌ఎస్‌ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వంపై అబద్దాలు ప్రచారం చేస్తున్నారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. కృష్ణా, గోదావరి నదులపై ఉన్న ప్రాజెక్టులు కేంద్రానికి స్వాధీనం చేయాలని రాష్ట్ర విభజన చట్టంలోనే ఉందని చెప్పారు.

బీఆర్ఎస్‌ ప్రభుత్వం చాలా తప్పులను చేసిందని అన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. తమ తప్పులను కాంగ్రెస్‌ సర్కార్‌పై వేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్రం తనని అడిగే కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలోని అంశాలను రాసిందని కేసీఆర్ చెప్పారని రేవంత్ గుర్తు చేశారు. విభజన చట్టంలో కృష్ణానదిలోని 811 టీఎంసీల నీటిని ఇరు రాష్ట్రాలు ఎలా పంచుకోవాలనేదానిపై కేంద్రం కమిటీ వేసిందని చెప్పారు. ఏపీకి 512, తెలంగాణకు 299 టీఎంసీలు ఇస్తున్నట్లు ప్రతిపాదించారని చెప్పారు. ఆ ప్రతిపాదనకు కేసీఆర్, అధికారులు ఒప్పుకున్నట్లు సంతకాలు చేశారని చెప్పారు. తద్వారా ఏపీకి ఎక్కువ నీరు వచ్చేలా చేసిందే కేసీఆర్ అని చెప్పారు సీఎం రేవంత్‌రెడ్డి. కృష్ణా నదిపై ఉన్న 15 ప్రాజెక్టులను కేంద్రానికి ఇస్తున్నట్లు 2022లో సంతకాలు చేశారని చెప్పారు.

బీఆర్ఎస్ ప్రభుత్వమే ప్రాజెక్టును కేంద్రానికి అప్పగించిందని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. కానీ.. ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈ పనిచేస్తున్నట్లుగా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. అయితే.. వైఎస్‌ హయాంలోనే పోతిరెడ్డిపాడు ద్వారా నీటి తరలింపు పెంచారనీ.. దీనిని కేసీఆర్, హరీశ్‌రావు నిరాకరించారని చెప్పారు. ఇలా చేయడం ద్వారా తెలంగాణకు అన్యాయం జరుగుతుందని కొట్లాడింది కాంగ్రెస్సే అని చెప్పారు. రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్ ద్వారా నీటి తరలింపునకు ఏపీ సీఎం జగన్ ప్రణాలిక చేస్తే.. రోజుకు 8 టీఎంసీలు ఏపీకి తరలించడానికి సీఎం కేసీఆర్ అనుమతిచ్చారని చెప్పారు. ఈ మేరకు 2022 మే 5న జీవో ఇచ్చారని రేవంత్‌రెడ్డి చెప్పారు. గతంలో కృష్ణానదిపై ఆధిపత్యం తెలంగాణ చేతిలో ఉండేది కానీ.. వైఎస్, చంద్రబాబు, జగన్ ఒత్తిళ్లకు కేసీఆర్ లొంగిపోయారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్‌ఎల్‌బీసీ, కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసిందని రేవంత్‌రెడ్డి అన్నారు. పదవులు, కమీషన్లకు లొంగి జలదోపిడీకి సహకరించారని అన్నారు. ఉమ్మడి ఏపీలో ఉన్నప్పటి కంటే కేసీఆర్‌ హయాంలోనే ఎక్కువ నిర్లక్ష్యం జరిగిందని సీఎం రేవంత్‌రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు.

Next Story