దేశ వ్యవసాయరంగం పెద్ద దిక్కుని కోల్పోయింది: సీఎం కేసీఆర్

భార‌త హ‌రిత విప్ల‌వ పితామ‌హుడు ఎంఎస్ స్వామినాథ‌న్ మృతి ప‌ట్ల సీఎం కేసీఆర్ సంతాపం వ్య‌క్తం చేశారు.

By Srikanth Gundamalla  Published on  28 Sept 2023 3:41 PM IST
Telangana, CM KCR, condolence, MS swaminathan, death,

దేశ వ్యవసాయరంగం పెద్ద దిక్కుని కోల్పోయింది: సీఎం కేసీఆర్

భార‌త హ‌రిత విప్ల‌వ పితామ‌హుడు ఎంఎస్ స్వామినాథ‌న్ మృతి ప‌ట్ల సీఎం కేసీఆర్ సంతాపం వ్య‌క్తం చేశారు. దేశ వ్య‌వ‌సాయ రంగం పెద్ద దిక్కును కోల్పోయింద‌ని అన్నారు సీఎం కేసీఆర్. దేశంలో వ్యవసాయ రంగంలో స్వామినాథన్ వినూత్న పద్దతులు చేర్చారని సీఎం కేసీఆర్ అన్నారు. ఆయన కృషి వల్లే ఆహార అభివృద్ధిలో భారత దేశం స్వయం సమృద్ధిని సాధించిందని పేర్కొన్నారు. స్వామినాథన్‌ రైతుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ అన్నారు. ఎంఎస్‌ స్వామినాథన్‌ (MS Swaminathan) మృతిపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, పలువురు మంత్రులు సంతాపం తెలిపారు.వ్యవసాయ రంగంలో వినూత్న మార్పులు తీసుకొచ్చి గ్రామీణ ప్రాంతాల రూపురేఖలను స్వామినాథన్ మార్చారని సీఎం కేసీఆర్ అన్నారు. ఆయన చేసిన సేవ ఎంతో విలువైనదని పేర్కొన్నారు. స్వామినాథన్‌ను ఎప్పటికీ మర్చిపోలేమని.. రైతుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని సీఎం కేసీఆర్ అన్నారు.

భారతీయ హరిత విప్లవానికి జాతిపతగా శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్‌ ని చెబుతుంటారు. ఆయన గురువారం మధ్యాహ్నం కన్నుమూశారు. స్వామినాథన్ భార‌తీయ వ్య‌వ‌సాయ రంగంలో ఆయ‌న అనేక విప్ల‌వాత్మ‌క మార్పుల‌ను సృష్టించారు. అత్య‌ధిక స్థాయిలో దిగుబ‌డిని ఇచ్చే అనేక వ‌రి వంగ‌డాల‌ను ఆయ‌న డెవ‌ల‌ప్ చేశారు. త‌క్కువ ఆదాయం ఉన్న రైతుల‌కు .. దిగుబ‌డిని పెంచే అనేక ప‌ద్ధ‌తుల‌ను స్వామినాథన్ నేర్పారు. కాగా.. స్వామినాథన్‌ సేవలకు గాను 1987లో వరల్డ్‌ ఫుడ్‌ ప్రైజ్‌ అవార్డు దక్కింది. ఆ తర్వాత ఆయన చెన్నైలో ఎంఎస్‌ స్వామినాథన్ రీసెర్చ్‌ ఫౌండేషన్‌ను ఏర్పాటు చేశారు. స్వామినాథన్ అనేక అంతర్జాతీయ అవార్డులను కూడా గెలుచుకున్నారు. రామ‌న్ మెగ‌స్సేసే అవార్డును 1971లో ఆయ‌న సొంతం చేసుకున్నారు. 1986లో ఆల్బ‌ర్ట్ ఐన్‌స్టీన్ వ‌ర‌ల్డ్ సైన్స్ అవార్డు స్వామినాథన్‌ను వ‌రించింది.

శాస్త్రవేత్త ఎంఎస్‌ స్వామినాథన్‌కు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. భార్య పేరు మీనా, కుమార్తెలు సౌమ్య, మధురా, నిత్య. ప్రపంచ ఆరోగ్య సంస్థలో సౌమ్య స్వామినాథన్‌ చీఫ్‌ సైంటిస్ట్‌గా పనిచేస్తోంది.

Next Story