మేయర్ పీఠాల లెక్క తేలింది..కరీంనగర్‌లో కాషాయం, నిజామాబాద్‌లో హస్తం

తెలంగాణలోని 7 మున్సిపల్ కార్పొరేషన్లు మరియు 116 మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికల ప్రక్రియ సోమవారంతో ముగిసింది.

By -  Knakam Karthik
Published on : 16 Feb 2026 5:02 PM IST

Telangana Politics, Karimnagar Mayor, Nizamabad Mayor, BJP vs Congress, Municipal Results 2026

మేయర్ పీఠాల లెక్క తేలింది..కరీంనగర్‌లో కాషాయం, నిజామాబాద్‌లో హస్తం

తెలంగాణలోని 7 మున్సిపల్ కార్పొరేషన్లు మరియు 116 మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికల ప్రక్రియ సోమవారంతో ముగిసింది. కౌంటింగ్ ముగిసిన తర్వాత మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నిక కోసం జరిగిన పరోక్ష ఎన్నికల్లో ఉత్కంఠభరిత పరిణామాలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా కరీంనగర్, నిజామాబాద్ కార్పొరేషన్ల ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ (KMC)లో భారతీయ జనతా పార్టీ చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. బీజేపీ అభ్యర్థి కొలగాని శ్రీనివాస్ మేయర్‌గా ఎన్నికయ్యారు. మొత్తం 60 డివిజన్లలో బీజేపీ 30 స్థానాలు గెలవగా, ఐదుగురు స్వతంత్ర అభ్యర్థుల మద్దతుతో మేయర్ పీఠాన్ని దక్కించుకుంది. ఎక్స్ అఫిషియో సభ్యుడు కూడా అయిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, పార్టీకి మేయర్ పదవిని కైవసం చేసుకోవడానికి అవసరమైన మద్దతును కూడగట్టడంలో కీలక పాత్ర పోషించారు. తెలంగాణలో ఒక కార్పొరేషన్ పీఠాన్ని బీజేపీ గెలవడం ఇదే తొలిసారి.

కాంగ్రెస్ ఖాతాలోకి నిజామాబాద్ మేయర్ పీఠం

నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో కాంగ్రెస్ పార్టీ పట్టు సాధించింది. కాంగ్రెస్ అభ్యర్థి నీతూ ఉమరాణి మేయర్‌గా ఎన్నికయ్యారు. బీజేపీ ఇక్కడ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా (28 సీట్లు) అవతరించినప్పటికీ, మ్యాజిక్ ఫిగర్‌కు దూరంగా నిలిచింది. కాంగ్రెస్ (17) మరియు ఎంఐఎం (14) కలవడంతో పాటు ఎక్స్-అఫీషియో సభ్యుల ఓట్లతో కాంగ్రెస్ మేయర్ పీఠాన్ని దక్కించుకుంది. ఎంఐఎంకు చెందిన సల్మా తహసీన్ డిప్యూటీ మేయర్‌గా ఎన్నికయ్యారు.

Next Story