హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నా వారు కూడా పోటీ చేయొచ్చని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రకటించారు. గత ప్రభుత్వంలో ఇద్దరు పిల్లల నిబంధన ఉండేదని, అంతకంటే ఎక్కువ మంది ఉంటే పోటీ చేసే అర్హత ఉండేది కాదన్నారు. ఇప్పుడు ఆ చట్టాన్ని మార్చాలని కేబినెట్ నిర్ణయించిందని పేర్కొన్నారు. దీంతో వార్డు మెంబర్, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్‌పీటీసీ ఎన్నికల్లో పోటీ చేసే వారికి ఊరట లభించనుంది.
''ఇద్దరు పిల్లలకు మించి సంతానమున్న వారు స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులనే నిబంధనను మంత్రివర్గం పునరాలోచన చేసింది. రాష్ట్రంలో జనాభా నియంత్రణ కట్టుదిట్టంగా అమలవుతున్న తరుణంలో ఈ గరిష్ఠ నిబంధన ను అమలు చేయాల్సిన అవసరం లేదనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ఈ నిబంధనను ఎత్తివేసేందుకు కేబినెట్ సూచనప్రాయంగా అంగీకరించింది'' అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈనెల 23వ తేదీన మళ్లీ కేబినెట్ సమావేశం కావాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు.
రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెండేండ్లు పూర్తయిన సందర్భంగా ప్రజా పాలన -ప్రజా విజయోత్సవాలను నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించిందన్నారు డిసెంబర్ 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఉత్సవాలు నిర్వహిస్తుంది. ఉత్సవాల నిర్వహణ.. సంబంధిత ఏర్పాట్లపై కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించిందని మంత్రి పొంగులేటి తెలిపారు.