Telangana: ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్..త్వరలో ప్రకటన..!
ప్రభుత్వ ఉద్యోగులు నిరీక్షిస్తున్న పీఆర్సీ నియామకంతో పాటు.. ఐఆర్ ప్రకటనకు అంతా సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
By Srikanth Gundamalla Published on 29 Sept 2023 10:05 AM ISTTelangana: ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్..త్వరలో ప్రకటన..!
తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులు నిరీక్షిస్తున్న పీఆర్సీ నియామకంతో పాటు.. ఐఆర్ ప్రకటనకు అంతా సిద్ధం చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. పెండింగ్ డీఏలపైనా నిర్ణయం వెలువడే అవకాశాలూ కనిపిస్తున్నాయి. దీంతో.. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల్లో ఆసక్తి పెరుగుతోంది.
తెలంగాణలో మరో పది రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వచ్చే వారం తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతోంది. అందులో భాగంగానే ఉద్యోగుల పెండింగ్ అంశాలపైనా నిర్ణయం తీసుకోబుతున్నారని తెలుస్తోంది. కాగా.. సెప్టెంబర్ 29వ తేదీనే తెలంగాణ కేబినెట్ సమావేశం జరగాల్సి ఉండగా.. సీఎం కేసీఆర్ అనారోగ్యం కారణంగా వాయిదా పడింది. వచ్చే వారం కేబినెట్ భేటీ నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అధికారులు ఉద్యోగుల పీఆర్సీ నియామకం దిశగా కసరత్తు చేస్తున్నారు. పీఆర్సీ చైర్మన్ గా ప్రభత్వ మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ సలహాదారు శైలేంద్రకుమార్ జోషిని ప్రభుత్వం నియమించే చాన్స్ ఉంది. సీఎం కేసీఆర్ కూడా ఆయనవైపే మొగ్గుచూపుతున్నారని సమాచారం .
పీఆర్సీతో పాటుగా ఉద్యోగులకు మధ్యంతర భృతిపైన కూడా ప్రకటన ఉంటుందని తెలుస్తోంది. పీఆర్‌సీ నివేదిక వచ్చే వరకు ఉద్యోగులకు మధ్యంతర భృతి అమలు చేయనున్నారు. ఇక ఇదే సమయంలో పెండింగ్ డీఏల గురించి ఉద్యోగ సంఘాలు తెలంగాణ ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తులు చేశాయి. ఇప్పుడు ఒక పెండింగ్ డీఏను విడుదల చేయడంతో పాటు పీఆర్సీ నియామకం, మధ్యంతర భృతి ప్రకటనకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలపనుందని సమాచారం అందుతోంది. అంతేకాదు ఉద్యోగుల ఆరోగ్య పథకం పైనా నిర్ణయం ఉండబోతుందని తెలుస్తోంది. ఇలా వచ్చే కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపై నిర్ణయాలు ఉండబోతున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు వచ్చే వారంలో జరిగే మంత్రివర్గ సమావేశం గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.