హైడ్రాకు ఫుల్‌ పవర్స్.. తెలంగాణ కేబినెట్ నిర్ణయం

తెలంగాణలో హైడ్రా కొద్ది కాలంగా హాట్‌ టాపిక్ అయిన విషయం తెలిసిందే.

By Srikanth Gundamalla  Published on  20 Sep 2024 4:00 PM GMT
హైడ్రాకు ఫుల్‌ పవర్స్.. తెలంగాణ కేబినెట్ నిర్ణయం

హైడ్రాకు ఫుల్‌ పవర్స్.. తెలంగాణ కేబినెట్ నిర్ణయం

తెలంగాణలో హైడ్రా కొద్ది కాలంగా హాట్‌ టాపిక్ అయిన విషయం తెలిసిందే. అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తూ వస్తోంది హైడ్రా. బఫర్ జోన్, ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఆక్రమణలు చేసి నిర్మించిన భవనాలు అన్నింటినీ కూల్చివేస్తోంది. ఈ క్రమంలో హైడ్రాపై కొంత మేర విమర్శలు వచ్చాయి. బుల్డోజర్లు వినియోగించి.. నోటీసులు ఇవ్వకుండా, అధికారాలు లేకున్నా ఈ కూల్చివేతలు సాగిస్తున్నారని ఫిర్యాదులు వచ్చాయి. ఈ క్రమంలోనే తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. అక్రమార్కుల గుండెల్లో వణుకు పుట్టిస్తోన్న హైడ్రాకు.. విస్తృత అధికారులు ఇచ్చింది. దాంతో.. అన్ని శాఖల మాదిరిగానే హైడ్రా పని చేయనుంది. అన్ని అధికారాలు ఇక హైడ్రాకు ఉంటాయని చెప్పారు.

మరోవైపు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు వడ్లపై 500 రూపాయల బోనస్ ఇచ్చే అంశంపై కూడా కేబినెట్‌లో సీఎం రేవంత్‌రెడ్డి మంత్రులతో చర్చించారు. దీనిపై కూడా సానుకూల నిర్ణయం తీసుకుంది రాష్ట్ర మంత్రి వర్గం. ఈ ఏడాది నుంచే రైతులకు సన్న వడ్లపై రూ.500 బోనస్ ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి పలు వేదికలపై ప్రకటించినట్టుగా.. మూడు యూనివర్సిటీల పేర్లు మార్చుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా.. కోటీ మహిళా విశ్వవిద్యాలయం పేరును చాకలి ఐలమ్మ యూనివర్సిటీగా మారుస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరును సురవరం ప్రతాప్ రెడ్డి యూనివర్సిటీగా, టెక్స్‌టైల్స్ అండ్ హ్యాండ్‌లూమ్స్ యూనివర్సిటీకి కొండ లక్ష్మణ్ బాపూజీ యూనివర్సిటీగా మార్చేందుకు తెలంగాణ మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది.

Next Story