రూ.2,91,159 కోట్లతో తెలంగాణ బడ్జెట్
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రూ.2,91,159 కోట్లతో తెలంగాణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
By అంజి Published on 25 July 2024 7:09 AM GMTరూ.2,91,159 కోట్లతో తెలంగాణ బడ్జెట్
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. బడ్జెట్‌ను ప్రవేశపెట్టాల్సిందిగా భట్టి విక్రమార్కను సభాపతి గడ్డం ప్రసాద్ కోరారు. నా తెలంగాణ కోటిరతనాల వీణ అంటూ దాశరథి చెప్పిన కవితతో భట్టి విక్రమార్క తన ప్రసంగాన్ని ప్రారంభించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రూ.2,91,159 కోట్లతో తెలంగాణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. రెవెన్యూ వ్యవయం రూ.2,20,945 కోట్లు. మూలధన వ్యయం రూ.33,487 కోట్లుగా బడ్జెట్‌లో పేర్కొన్నారు.
భట్టి మాట్లాడుతూ.. తెలంగాణ పురోభివృద్ధి అంటూ గత పాలకులు.. ఉత్తరకుమార ప్రగల్భాలు పలికారని భట్టి అన్నారు. వాళ్ల పాలనలో రూ.6.70 లక్షల కోట్లకు అప్పులు చేరాయని ధ్వజమెత్తారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దుబారా ఖర్చులు కట్టడి చేసి.. ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షన్ దారులకు సకాలంలో జీతాలు, పెన్షన్లు చెల్లించామని భట్టి విక్రమార్క తెలిపారు. గత పాలకులు రూ.6,71,757 కోట్లు అప్పు చేసినా.. వాటిని తీర్చేందుకు చర్యలు చేపట్టామన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నా.. సంక్షేమాన్ని విస్మరించలేదని తెలిపారు.
బీఆర్‌ఎస్ పాలనలో తెలంగాణ అప్పు 10 రెట్లు పెరిగిందని, రాష్ట్రం అభివృద్ధి చెందలేదని భట్టి అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో గత ప్రభుత్వం విఫలమైందన్నారు. ఈ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. బీఆర్‌ఎస్ కింద సాగునీటి ప్రాజెక్టుల అవినీతి వల్ల రైతులు ఇప్పటికీ నష్టపోతున్నారని భట్టి ఆరోపించారు. డిసెంబర్ నుండి ఉచిత బస్సు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రైతు భరోసా, బియ్యం సబ్సిడీ వంటి వివిధ పథకాలకు రూ.34579 కోట్లు ఖర్చు చేసినట్లు భట్టి తెలిపారు. అనేక ప్రభుత్వ శాఖలలో 31,768 రిక్రూట్‌మెంట్ పేపర్‌లను పంపిణీ చేసినట్లు భట్టి చెప్పారు.