Telangana: ఒకే ఒక్క అభ్యర్థితో బీజేపీ రెండో జాబితా విడుదల

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేసింది.

By -  Srikanth Gundamalla
Published on : 27 Oct 2023 3:15 PM IST

telangana, bjp second list,  one candidate,

 Telangana: ఒకే ఒక్క అభ్యర్థితో బీజేపీ రెండో జాబితా విడుదల

తెలంగాణలో నవంబర్‌ 30న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే. అయితే.. అభ్యర్థులు ఎంపిక విషయం ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల ఎంపిక విషయంలో వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నాయి. గెలిచే గుర్రాలనే రేస్‌లో నిలబెట్టాలని భావిస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే తొలి జాబితాను విడుదల చేశాయి. రెండో జాబితాపై కసరత్తులు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే బీజేపీ అనూహ్యంగా ఒకే ఒక్క అభ్యర్థితో సెకండ్‌ లిస్ట్‌ను విడుదల చేసింది. మహబూబ్‌నగర్‌ అసెంబ్లీ బీజేపీ అభ్యర్థిగా మిథున్‌రెడ్డిని జాతీయ నాయకత్వం ప్రకటించింది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో ఒకే ఒక్క అభ్యర్థి పేరును ప్రకటించింది. మహబూబ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి పార్టీ కీలక నేత, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కుమారుడు ఏపీ మిథున్ కుమార్ రెడ్డి పేరును ఖరారు చేసింది. మొన్నటి వరకు మిథున్ రెడ్డి కోసం షాద్ నగర్ సెగ్మెంట్ కేటాయించాలని జితేందర్ రెడ్డి పట్టుబడ్డారు. కాగా ఆయనకు, కుమారుడికి రెండుచోట్ల టికెట్ ఇవ్వటం కుదరదని హైకమాండ్ నుంచి సంకేతాలు రావడంతో కొడుకు కోసం జితేందర్ రెడ్డి తన సీటునే త్యాగం చేసినట్లు తెలిసింది.

ఇక ఇప్పుడు పూర్తిస్థాయిలో అభ్యర్థుల ప్రకటనపై బీజేపీ జాతీయ నాయకత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. తొలి విడతలో ఇప్పటికే 52 మందిని ప్రకటించింది. అందులో ముగ్గురు ఎంపీలు బరిలో దిగారు. కరీంనగర్‌ నుంచి బండి సంజయ్, కోరుట్ల నుంచి ధర్మపురి అర్వింద్, బోథ్‌ నుంచి సోయం బాపూరావు అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగారు. ఇక మరోవైపు బీజేపీ కీలక నేత ఈటల రాజేందర్‌ రెండు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారు. ఒకటి ఆయన సొంత నియోజకవర్గం హుజూరాబాద్‌, మరోటి కేసీఆర్‌కు పోటీగా గజ్వేల్‌ నుంచి కూడా బరిలో దిగుతున్నారు.

Next Story