మూడు రోజులే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
మూడు రోజులు మాత్రమే అసెంబ్లీ సెషన్ ఉంటుందని బీఏసీ సమావేశం నిర్ణయం తీసుకుంది.
By Srikanth Gundamalla Published on 3 Aug 2023 3:30 PM ISTమూడు రోజులే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది. ఈ భేటీలో అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై నిర్ణయం తీసుకున్నారు. సమావేశంలో డిప్యూటీ స్పీకర్ పద్మారావు, పలువురు మంత్రులు, కాంగ్రెస్ నుంచి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మజ్లీస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే అక్బరుద్దీన్ పాల్గొన్నారు.
మరికొద్ది రోజుల్లోనే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో.. రెండోసారి కేసీఆర్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత చివరి సారిగా జరుగుతున్న సమావేశాలు ఇవి. దాదాపు 15 నుంచి 20 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తారని అంతా భావించారు. కానీ.. అందుకు విరుద్ధంగా మూడు రోజులు మాత్రమే అసెంబ్లీ సెషన్ ఉంటుందని బీఏసీ సమావేశం నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా ఎక్కువ రోజులు సమావేశాలు నిర్వహించాలని విపక్షాలు కోరాయి. 20 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని కాంగ్రెస్ ప్రధానంగా కోరింది. పని దినాలు కాదు.. పని గంటలను చూడాలంటూ బీఆర్ఎస్ మంత్రులు తెలిపినట్లు సమాచారం. ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం దాదాపు 10 బిల్లులను ప్రవేశపెట్టనుంది. శుక్రవారం వరదలపై చర్చించగా.. శనివారం పలు బిల్లులపై చర్చించే అవకాశం ఉంది.
అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాక.. తొలుత కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న మృతిపట్ల శాసనసభ నివాళులర్పించింది. సభలో సాయన్న మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. అనంతరం సభ వాయిదా పడింది.
నాలుగు దశాబ్దాల పాటు రాజకీయాల్లో ఎమ్మెల్యేగా, ఇతర అనేక హోదాల్లో సాయన్న పని చేశారని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. వ్యక్తిగతంగా సాయన్నతో మంచి అనుభవం ఉందని కేసీఆర్ తెలిపారు. ఎలాంటి సందర్భాల్లో అయినా సాయన్న చిరునవ్వు, ఓపికతో ఉండేవారని, అందరితో కలుపుగోలుగా ఉండేవారని గుర్తు చేసుకున్నారు. హైదరాబాద్ జీహెచ్‌ఎంసీలో కంటోన్మెంట్‌ను కలిపేందుకు సాయన్న ఎంతో కృషి చేశారని సీఎం కేసీఆర్ తెలిపారు. కంటోన్మెంట్ ప్రజల కోసం సాయన్న ఎప్పుడూ తపన పడుతుండేవారని అన్నారు. ఇందుకోసం అనేక సందర్భాల్లో తీర్మానాలు చేసి కేంద్రానికి పంపినట్లు కూడా సీఎం కేసీఆర్ తెలిపారు. దీనిపై కేంద్రం పాజిటివ్‌గా ఉందని శుభవార్త అందిందని కూడా తెలిపారు సీఎం కేసీఆర్. దాంతో.. సాయన్న కోరిక నెరవేరుతుందని పేర్కొన్నారు. సాయన్న లోటు తీర్చలేనిదని, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ.. వారికి ఎప్పుడూ అండగా ఉంటామని సీఎం కేసీఆర్ చెప్పారు.